కథానాయకుడి ‘బాక్సాఫీస్ ఫెయిల్యూర్’కి కారణాలివే !

Published on Jan 20, 2019 11:32 pm IST


‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మహానటుడు ‘ఎన్టీఆర్’ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో తెరకెక్కతున్న ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై, మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను మాత్రం రాబట్టుకోలేకపోయింది. నిజానికి కథానాయకుడు పెద్దగా నిరుత్సాహ పరిచకపోయినా.. ప్లాప్ అవ్వడానికి మాత్రం చాలానే కారణాలు ఉన్నాయి.

ప్రధానంగా ఎన్టీఆర్ తెలుగు వెండితెర ఆరాధ్య దైవంగా కోట్లాది ప్రజలు చేత గౌరవింపబడ్డారు. ఇప్పుడు కొత్తగా ఆయన గొప్పోడు అని చెప్పాలా ? ఒక గొప్ప వ్యక్తిని గొప్పోడు అంటూ పది నిముషాల పాటు మరో గొప్ప వ్యక్తి ప్రసంగిస్తేనే ఇప్పటి సగటు ప్రేక్షకుడికి ఎక్కడా లేని విసుగు వచ్చేస్తోంది. అలాంటి ఈ పరిస్థితుల్లో దాదాపు మూడు గంటలు పాటు గొప్పతనం గురించే చెప్పిందే చెప్తూ ఉంటే.. ఇంక ఆసక్తి ఏముంటుంది ? అందుకే మెజార్టీ వర్గం సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయలేకపోయారు.

దానికి తోడు ఎన్టీఆర్ సినీ జీవితంలో పెద్ద‌గా అపజయాలు గాని, క‌ష్టాలు గాని ఎదురుకున్నది లేదు. ఆయ‌న ఏకైక మ‌హారాజులా తెలుగు సినీ పరిశ్రమను కొన్ని ద‌శాబ్దాల పాటు తన కను సైగలతోనే ఏలారన్నది అక్షర సత్యం. అందుకే సినిమాలో అంతా ఎన్టీఆర్ వైభోగాన్నే చూపించాల్సి వచ్చింది. దర్శకనిర్మాతలు కూడా అలాగే చూపించారు. ఇక్కడే సినిమా నియమానికి విరుద్ధంగా జరిగింది. ‘సంఘర్షణ లేని కథ, అవరోధాలు అడ్డంకులు లేని కథనం’ సినిమాకి ఏ మాత్రం పనికి రావని సినీ పండితులు ఎప్పుడూ చెప్పే సిద్దాంతాలు.

ఆ లెక్కన చూసుకుంటే కథానాయకుడులో సంఘర్షణ లేని కథ, అవరోధాలు అడ్డంకులు లేని కథనమే చాలా భాగం సాగింది. పైగా సాగతీత సన్నివేశాలు ఎక్కువ అవ్వడం, వాటికి అనవసరమైన సీక్వెన్స్ స్ తోడవ్వడం, వీటికి తోడు గొప్పతనం గురించే పదే పదే చెప్పడం, ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణాన్ని మరీ సినిమాటిక్ గా చూపించడం, ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమా విడుదల సన్నివేశం కూడా బాగా నాటకీయంగా అనిపించడం, ఎన్టీఆర్ యుక్త వయసు గెటప్స్ లో.. పై పడ్డ బాలకృష్ణ వయసు కనిపించిడం, సినిమా మొత్తం చాలా వరకు డాక్యుమెంటరీలా అనిపించడం, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘వివిఆర్’కి, బాగా ఎంటర్టైన్మెంట్ ఉన్న ‘ఎఫ్ 2’కి పోటీగా రావడం, అలాగే బాలయ్య నటించిన చాలా పాత్రల విషయంలో, గెటప్స్ విషయంలో కొన్ని పొరపాట్లు జరగడం వంటి అంశాలు ‘కథానాయకుడు’ పరాజయంలో కీలక పాత్ర పోషించాయి.

అలాగే కథానాయకుడు పరాభవానికి సినిమా విడుదల సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా కొంతవరకు ప్రభావం చూపాయి అన్నది వాస్తవం. అందులో ముఖ్యమైనది ప్రధానమైనది నాగబాబు, బాలకృష్ణల మధ్య వివాదం. నాగబాబు వ్యాఖ్యలకు సపోర్ట్ గా బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడుని మెగా ఫ్యాన్స్ వేలి వేశారని.. అందుకే కథానాయకుడు కలెక్షన్స్ ను రాబట్టలేక చతికిల పడిందని సోషల్ మీడియాలో కొంతమంది మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

కానీ ఒక సినిమా రిజల్ట్ అనేది దాదాపు ప్రేక్షకులందరి చేతుల్లోనే ఉంటుందనేది జగమేరిగిన సత్యం. సినిమా బాగాలేదని ఎవరు ఎంతమంది ఎన్నిసార్లు మోత్తుకున్న సినీ అభిమానులు మాత్రం.. సినిమా బాగుంటే ఆ సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారు. అయితే కథానాయకుడు అందరూ బాగుంది అన్నా.. అన్ని రకాలుగా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినా.. ఆశించిన స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రాలేదు. ఈ కలెక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ సినిమా కలెక్షన్స్ పై నాగబాబు కామెంట్స్ పని చేశాయా..! ఇది నమ్మశక్యంగా లేకపోయినా నాగబాబు గ్యాప్ లేకుండా బాలకృష్ణను టార్గెట్ చేస్తూ.. ముందు నుంచి మెగా హీరోలను బాలయ్య ఏ విధంగా చిన్న చూపు చూశాడో.. తమ ఫ్యాన్స్ కు వివరంగా చెబుతూ వచ్చాడు. దాంతో మెగా అభిమానులు అంతా నాగబాబుకి అండగా నిలబడి.. బాలయ్య సినిమాను అవాయిడ్ చేశారట. ఇది పూర్తిగా అంగీకరించే విధంగా లేనప్పటికీ.. ఇందులో కూడా కొంతవరకు వాస్తవం ఉంది.

అలాగే ‘మ‌హాన‌టి’ సావిత్రి బ‌యోపిక్‌ తో పోల్చి చూడటం కూడా కథానాయకుడుకి అసలు కలిసిరాలేదు. సహజంగానే ‘మ‌హానటి’లో ఉన్న ఎమోష‌న్, ఎన్టీఆర్ లో మిస్ అవుతుంది, అలాగే అయింది. ఈ విషయంలో మహిళా ప్రేక్షకులను కథానాయకుడు ఆకట్టుకోలేకపోయాడు. మొత్తానికి కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. కథానాయకుడి పరాభవానికి కూడా చాలా కారణాలే ఉన్నాయి. మరీ మహానాయకుడు అన్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించి, కథానాయకుడి పరాభవాన్ని తుడిచిపెట్టాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

X
More