ఇంటర్వ్యూ : ఎన్టీఆర్ – ‘అరవింద సమేత’ స్త్రీల ప్రాముఖ్యతను పెంచే సినిమా !

Published on Oct 6, 2018 11:25 pm IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం ‘అరవింద సమేత’. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

ముందుగా, ‘అరవింద సమేత వీర రాఘవ’ టైటిల్ విన్నప్పుడు మీకెలా అనిపించింది. మీ ఇమేజ్ కి పూర్తి సరిపడని టైటిల్ అనే ఫీలింగ్ కలగలేదా ?

లేదండి. టైటిల్ కథను బట్టే పెట్టాము. మాములుగా మనం గుడికి వెళ్లిన కూడా.. లక్ష్మి సమేత నరసింహులవారు, సీత సమేత రాములవారు అని పిలుస్తారు. ఆ దేవుళ్ళకే తప్పలేదు ఆడవాళ్ళ పేర్లు ముందు పెట్టుకోవడం అనేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా స్త్రీల ప్రాముఖ్యతను పెంచేలా ఉంటుంది. అదికాక సినిమాలో బలమైన కంటెంట్ ఉంది, అంటే అరవింద సమేత చిత్రం అనేది స్త్రీలను ఎలా గౌరవించాలి, వైలెన్స్ ని ఎలా ఆపాలి అని చెప్పే సినిమా. ఈ సినిమాకి ఇదే కరెక్ట్ టైటిల్.

ఆడియో ఈవెంట్ లో త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలని మీ పన్నెండు కల అన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ తో కలిసి పని చేశారు. ఆయనతో ఆ జర్నీ ఎలా అనిపించింది ?

మేము చాలా సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా మేం కలిసి సినిమా చేద్దామనే అనుకుంటున్నాము. కానీ ఎందుకో కుదరలేదు. ఫైనల్ గా అరవింద సమేతకి సెట్ అయింది. అయితే మేం ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు ఎలాగైనా హిట్ సినిమా తీసేయాలి అని మేం ఈ మూవీ చెయ్యలేదు. మా నుండి ఒక జన్యూన్ సినిమా రావాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాము. రేపు ప్రేక్షకులకు కూడా మా ప్రయత్నాన్ని అంగీకరిస్తారని ఆశిస్తున్నాను.

ట్రైలర్ చూస్తే సినిమాలో చాలా వైలెన్స్ ఉన్నట్లు అనిపిస్తోంది. అంత వైలెన్స్ ఇప్పటి సినిమాల్లో అవసరం అంటారా ?

తప్పనిసరి కాదు అండి. కానీ ఒక సున్నితమైన సమస్యను చూపిస్తున్నప్పుడు, మొదట దానిలో ఉన్న దుర్మార్గాన్ని చూపించాలి. అప్పుడే ఆ సమస్య తాలూకు తీవ్రత తెలుస్తోంది. అయిన ఈ సినిమాలో.. అసలు మనుషులకు వైలెన్స్ అవసరం లేదనే సందేశాన్నే ఇచ్చాము. గతంలో కూడా ఈ టైపు జోనర్లలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ మేము వైలెన్స్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం తీసుకుని, దానికి సరైన పరిష్కారం చూపించే ప్రయత్నం చేశాము.

త్రివిక్రమ్ గత సినిమా అజ్ఞాతవాసి పరాజయం పాలైయింది. ఈ సినిమా సెట్స్ లో ఆయనలో ఆ సినిమా రిజల్ట్ తాలూకు ఒత్తిడిని ఏమైనా గమనించారా ?

లేదండి. ఎందుకంటే త్రివిక్రమ్ అద్భుతమైన రచయితతో గొప్ప నైపుణ్యం కలిగిన దర్శకుడు కూడా. తనకి ఒత్తిడి ఉండదు. ఇక ‘అజ్ఞాతవాసి’ చిత్రం ప్రభావం అరవింద సమేత పై అస్సలు ఉండదు. ఏ దర్శకుడికైనా, నటుడికైనా ప్రతీ సినిమా ఓ సరికొత్త ప్రయాణం. నా కెరీర్‌లో కూడా నాకు ఫ్లాప్స్‌ వచ్చాయి. ఆ తరువాత వెంటనే హిట్లు వచ్చాయి. అందుకే ఎప్పుడైనా ఒక ఫ్లాప్‌ చిత్రం ప్రభావం ఆ తర్వాత చిత్రం పై ఉండదు. ఎందుకంటే మరింత జాగ్రత్తతో పని చేస్తాము. ఇక ఈ అరవింద సమేత చిత్రం పూర్తిగా త్రివిక్రమ్‌ మార్క్‌ సినిమా.

అరవింద సమేత ఆల్బమ్ లోకల్లా పెనివిటీ పాట బాగా పాపులర్ అయింది. ఆ పాట గురించి చెప్పండి ?

ఈ పాట చాలా యాదృచ్చికమైన మా లైఫ్ లో కనెక్ట్ అయింది. మా నాన్నగారు పోయిన కొన్ని రోజుల తరువాత ఈ పాట మేము షూట్ చేశాము. ఈ పాటకు నేను ఎమోషనల్ గా చాలా దగ్గరయ్యాను. ఈ పాటలోని సంఘటనలు నా లైఫ్ కి ఎక్కడో కనెక్ట్ అయ్యాయి. ఈ పాట టేకింగ్ లో త్రివిక్రమ్ మార్క్ సృజనాత్మకతను మీరు చూస్తారు.

అరవింద సమేత చిత్రం మీ పై ఏ విధమైన ప్రభావం చూపింది ?

ఒక వ్యక్తిగా నేను ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే చాలా ప్రభావితం అయ్యాను. ఈ కథలోని అంశాలు వల్ల జీవితంలోని కొన్ని విషయాల్లో నా అభిప్రాయం మారింది. అంత గొప్ప స్క్రిప్ట్ ఇది.

సంబంధిత సమాచారం :