‘రాజుగారి గది’.. ఓంకార్ దర్శకత్వంలో రూపొంది ఈ దసరాకు విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా. లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఓ చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి గది, బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనాన్నే నమోదు చేసింది. ఇప్పటికీ స్టడీగా నడుస్తోన్న ఈ సినిమా నిర్మాతలకు, పంపిణీదారులకు ఊహించని స్థాయి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శకుడిగా ఓంకార్‌కు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ క్రేజ్‌తో తన తదుపరి సినిమాను కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేయాలని ఓంకార్ భావిస్తున్నారు.
రాజుగారి గది రిలీజ్‌కి ముందు ఓంకార్, తన భవిష్యత ప్రణాళికను ప్రస్తావిస్తూ, తనవద్ద ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్, రాజుగారి గది సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నాయని ఈ రెండిట్లో ముందు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తానని తెలిపారు. అయితే రాజుగారి గది సినిమా ఊహించన్ రేంజ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవడంతో ఆ వెంటనే ఓంకార్ రాజుగారి గది సీక్వెల్‌నే ముందు తెరకెక్కించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధంగా ఉన్న స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేస్తే రాజుగారి గది సీక్వెల్‌తో కూడా మెప్పించవచ్చని ఓంకార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. దీంతో ఓంకార్ తదుపరి ప్రాజెక్ట్ రాజుగారి గది సీక్వెలే అవుతుందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
