2017 ఏప్రిల్ 28 ఇదే రోజున ‘బాహుబలి – 2’ విడుదలై యావర్ భారతీయ సినీ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు, గొప్ప అనుభూతికి గురిచేసి అఖండ విజయంగా నిలిచింది. అప్పటి వరకు భారతీయ సినీ పరిశ్రమ చూడని రీతిలో వసూళ్ల వర్షం కురిపించిందీ సినిమా. సినిమా విడుదలై ఇప్పటికి ఏడాది గడుస్తున్నా ఇండియాలో ఈ సినిమా పేరు మీదున్న రికార్డుల్ని ఏ చిత్రమూ అధిగమించలేకపోయింది.
కళకు భాషా బేధం లేదనే సూక్తిని కూడ ఈ చిత్రం రుజువు చేసింది. ఒక్క ఇండియాలోనే కాకుండా విడుదలైన ప్రతి దేశంలో అశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కించుకున్న ఈ చిత్రం ప్రపంచావ్యాప్తంగా రూ.1650 కోట్లకు పైగానే గ్రాస్ ను వసూలు చేసింది. అంతేగాక గత ఏడాది డిసెంబర్లో జపాన్ దేశంలో విడుదలైన ఈ చిత్రం 100 రోజులు పూర్తిచేసుకుని ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తుండటం విశేషం. ఇటీవలే రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్ కు వెళ్లగా అక్కడి ప్రేక్షకులు వారి పట్ల చూపిన గౌరవం చూస్తే తెలుగు సినిమా ఖ్యాతిని ఈ సినిమా ఎన్ని రెట్లు వృద్ధి చేసిందో అవగతమవుతుంది. అంతేగాక మే 4వ తేదీన చైనాలో కూడ ఈ చిత్రం విడుదలకానుంది.
రాజమౌళి విజన్ ఎంతటిదో తెలిసిన రచయిత, అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించగా రాజమౌళిని నమ్మి కథానాయకుడు ప్రభాస్ ఏకంగా మూడేళ్ల తన కెరీర్ ను పూర్తిగా ఈ సినిమా కోసం అంకితం చేయగా రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, నాజర్, సత్యరాజ్ వంటి నటీనటులు తన అసామాన్య నటనతో, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ లు తమ ప్రతిభతో చిత్రాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిల తెలుగులో అప్పటి వరకు ఏ నిర్మాత వెచ్చించనంత భారీ మొత్తాన్ని ఈ సినిమాపై ఖర్చు పెట్టి ఒక గొప్ప సినిమాకు నిర్మాతల తోడ్పాటు ఎలా ఉండాలి అనే విషయానికి ఉత్తమమైన ఉదాహరణగా నిలిచారు.
ఈ సినిమాతో ఇండియన్ సినిమా యొక్క మేకింగ్ విలువలు కూడ బాగా పెరిగాయి. దర్శకులు, నిర్మాతలు, పెద్ద హీరోలు తమ సినిమాలు సాంకేతిక పరంగా ఉన్నత స్థాయిలో ఉండేలా కృషి చేస్తున్నారు. ఇలా సినిమా రంగానికి సంబంధించి అనేక అంశాల్లో భారతీయ చిత్ర పరిశ్రమను కొత్త పుంతలు తొక్కేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళిగారికి ఇంత గొప్ప సినిమాను అందించినందుకుగాను మరోసారి స్టాండింగ్ ఒవియేషన్ ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో దేశం గర్వించదగ్గ ఇలాంటి సినిమాలే మరెన్నో రూపొందించాలని కోరదాం.


