సమీక్ష : వ్యవస్థ – జీ 5 లో తెలుగు వెబ్ సిరీస్

సమీక్ష : వ్యవస్థ – జీ 5 లో తెలుగు వెబ్ సిరీస్

Published on May 1, 2023 12:01 AM IST
Vyavastha Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: కార్తీక్ రత్నం, హెబ్బా పటేల్, సంపత్ రాజ్, కామ్నా జఠ్మలానీ, సుకృత వాగ్లే, శివాని, సుజిత్ కుమార్, రాజా అశోక్, గురు రాజ్ తదితరులు

దర్శకులు : ఆనంద్ రంగ

నిర్మాతలు: పట్టాబి ఆర్ చిలుకూరి

సంగీత దర్శకులు: నరేష్ కుమారన్

సినిమాటోగ్రఫీ: అనిల్ బండారి

ఎడిటర్: ఆది నారాయణ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 వారు ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇక తాజాగా జీ 5 వారు ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వ్యవస్థ. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

 

యామిని (హెబ్బా పటేల్) పెళ్ళైన మొదటి రాత్రి తన భర్త హత్య కేసులో అరెస్ట్ అవుతుంది. అనంతరం తన కేసు కోసం ప్రముఖ లాయర్ మరియు చెక్ మేట్ అనే లాఫర్మ్ హెడ్ అయిన చక్రబోర్తి (సంపత్ రాజ్) ని ఆమె కలుస్తుంది. అయితే చక్రబోర్తి మీద నమ్మకం లేకపోవడంతో అతని కింద పనిచేసే లాయర్ వంశీ (కార్తీక్ రత్నం) ని తన కేసు కోసం కలుస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, గతంలో యామిని ని వంశీ ప్రేమిస్తాడు. మరి ఆ తరువాత ఏమి జరుగుతుంది. చక్రబోర్తి నుండి వంశీ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, ఇంతకీ చివరికి యామినిని తన భర్త మర్డర్ కేసు నుండి వంశీ బయటపడేశాడా అనేవి అన్నిటికీ సమాధానాలు కావాలంటే వ్యవస్థ సిరీస్ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ముందుగా లాయర్ వంశీ గా నటించిన కార్తీక్ రత్నం తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. గతంలో కేర్ ఆఫ్ కంచరపాలెం, నారప్ప సినిమాలతో ఆకట్టుకున్న కార్తీక్ కి ఈ సినిమా మరింత మంచి పేరుని తెచ్చిపెడుతుంది అని చెప్పాలి. అతని తరువాత లాయర్ చక్త్రాబోర్తి పాత్రలో తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు సంపత్ రాజ్. పలు కీలక సన్నివేశాల్లో ఆయన నటన ఎంతో ఆకట్టుకుంటుంది. న్యాయ వ్యవస్థలో చక్రబోర్తి తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించే కొన్ని సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కథ ఆకట్టుకునేలా ప్రారంభం కావడంతో పాటు మెల్లగా ఒక్కొక్క పాత్ర పరిచయంతో కథనం కూడా అలరిస్తుంది. కామ్నా జఠ్మలానీ చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ అందులో తన నటనతో ఆకట్టుకున్నారు. కాగా ఆమె పాత్ర ద్వారా చాలామందికి తెలియని ఒక షాకింగ్ పాయింట్ ని డైరెక్టర్ టచ్ చేసారు. డైలాగులు ఎంతో బాగున్నాయి. అవి సిరీస్ ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకు నడిపాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఫస్ట్ ఎపిసోడ్ తరువాత సిరీస్ ఎటువైపు వెళుతుంది అనేది మనకు కొంత గందరగోళంగా మారుతుంది. పలు కొత్త పాత్రలు రంగప్రవేశంతో పాటు కొన్ని సబ్ ప్లాట్స్ కథ పై కొంత నిరాసక్తత ని ఏర్పరుస్తాయి. నిజానికి సంపత్ రాజ్ క్యారెక్టర్ ని బాగానే చూపించినప్పటికీ అది మరింత బలంగా ఉండి ఉంటె బాగుండేదనిపిస్తుంది. కొన్ని సీన్స్ మళ్ళి మళ్ళి వచ్చి వెళ్తూ రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. కథనంలో ఒకింత రిలేటెడ్ గా లేని పాత్రల రంగప్రవేశంతో మెయిన్ పాయింట్ ని ఆడియన్స్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని అనవసర సన్నివేశాలను ఎక్కువగా ఫోకస్ చేస్తూ చూపించారనిపిస్తుంది. ఎడిటింగ్ ఒకింత విచిత్రంగా అనిపించడంతో పాటు చాలా సీక్వెన్స్ లకు కనెక్షన్ లేదనిపిస్తుంది. కథ లోని కీలక సమయంలో హెబ్బా పటేల్ కనపడకపోవడం చూస్తే అసలు దర్శకుడు మనకి ఏమి చెప్పదలచుకున్నారు అనేది అర్ధం కాదు. సబ్ ప్లాట్ పై అతిగా ఫోకస్ చేయడంతో షో చాలా వరకు నీరసంగా సాగుతుంది. న్యాయవ్యవస్థలో లంచాలు అనే అంశం తీసుకుని కథనం ముందుకి నడిపిన దర్శకుడు దానిని ఆకట్టుకునే రీతిన ప్రెజంట్ చేయలేదు. ఇక ఈ సిరీస్ యొక్క రన్ టైం కూడా ఎక్కువ కావడంతో చూడడానికి ఆడియన్స్ కి కొంత సహనం కావాల్సి ఉంటుంది. ఇక ముగింపు కూడా పూర్తిగా డిజప్పాయింటింగ్ గా ఉంటుంది.

 

సాంకేతిక వర్గం :

 

నరేష్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. అనిల్ బండారి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అయితే సిరీస్ లో కథకు అనుసంధానంగా లేని చాలా వరకు అనవసరమైన సన్నివేశాలను ఎడిటింగ్ విభాగం వారు ట్రిమ్ చేసి ఉంటె బాగుండేది. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి వర్క్ బాగుంది. ఇక ఫైనల్ గా దర్శకుడు ఆనంద్ రంగ విషయానికి వస్తే, ఆయన పర్వాలేదనిపించేలా దీనిని తెరకెక్కించారు. ముఖ్యంగా చాలావరకు సబ్ ప్లాట్స్ ఉండడం వలన కథలో మెయిన్ పాయింట్ అనేది మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇక చాలావరకు కథనం మెల్లగా సాగడంతో పాటు ఆడియన్స్ కి నిరుత్సాహం తెప్పిస్తుంది. కథ లో బలం ఉన్నా చాలా వరకు టేకింగ్ ఆకట్టుకోకపోవడంతో ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపిస్తుంది.

 

తీర్పు :

 

మొత్తంగా వ్యవస్థ అనే ఈ లీగల్ సిరీస్ డ్రామా ప్రారంభంలో ఆకట్టుకున్నప్పటికీ కథనం మెల్లగా సాగిన తీరు బోరింగ్ గా అనిపిస్తుంది. నిజానికి పాయింట్ బాగున్నా అది ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు దర్శకుడు. సబ్ ప్లాట్స్ పై ఎక్కువగా ఫోకస్ చేయడంతో మెయిన్ పాయింట్ సైడ్ చేయబడినట్లు అనిపిస్తుంది. ఇక కార్తీక్ రత్నం, సంపత్ రాజ్ ల ఆకట్టుకునే పెర్ఫార్మన్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఈ సిరీస్ కి బలం.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు