బాలీవుడ్ సినిమా ఒరిజినల్ స్టోరీతో ‘శంకరాభరణం’!

Shankarabharanam-
‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’.. హీరో నిఖిల్ తన కథల విషయంలో ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దూసుకెళుతున్నాడో చెప్పడానికి ఈ మూడు సినిమాలు చాలు. హ్యాట్రిక విజయాల తర్వాత నిఖిల్ నటించిన మరో సరికొత్త కథాంశంతో నడిచే సినిమా శంకరాభరణం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, మాటలు అందించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తూ చేసిన సినిమా కావడంతో శంకరాభరణం సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ కనిపించింది. నేడు ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక హైద్రాబాద్‌లో జరగనుంది. ఇక ఆడియో రిలీజ్ కోసం చేస్తోన్న ప్రమోషన్స్‌లో భాగంగా కోన వెంకట్ శంకరాభరణం సినిమా మూలకథ ప్రస్తావన తీసుకొచ్చారు.

బాలీవుడ్‌లో 2010లో విడుదలై విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగానూ సూపర్‌హిట్‌గా నిలిచిన ‘పస్ గయే రే ఒబామా’ సినిమా మూలకథ నుంచి శంకరాభరణం సినిమాను నిర్మించామని కోన వెంకట్ తెలిపారు. మూలకథ మాత్రమే తీసుకొని తెలుగు సినిమాకు తగ్గ మార్పులు చేసుకొచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పస్ గయే రే ఒబామా కథకు సంబంధించి నిర్మాతల దగ్గర్నుంచి హక్కులు తీసుకున్నాకే సినిమా మొదలుపెట్టామని కోన వెంకట్ తెలిపారు. ఉదయ్ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందిత హీరోయిన్‌గా నటించగా, అంజలి ఓ కీలక పాత్రలో నటించారు.

Exit mobile version