‘గోపాల గోపాల’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా ‘గబ్బర్ సింగ్ 2’ ఎప్పుడు మొదలు పెడతారా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 29 నుంచి మొదలు కానుంది అని చెప్పడంతో అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఇది కాసేపు పక్కన పెడితే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఏ పొలిటికల్ ఫంక్షన్ లో కనిపించినా, ఏ పబ్లిక్ ఈవెంట్ లో కనిపించినా ఫుల్ గడ్డంతో కనిపిస్తూ అందరినీ షాక్ చేస్తున్నాడు. కానీ ఈ లుక్ లో ఎందుకు పవన్ ఉన్నాడు అనే విషయం తెలియక చాలా మంది ఫ్యాన్స్ సందిగ్దంలో ఉన్నారు.
ఫేమస్ మీడియా సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ‘గబ్బర్ సింగ్ 2’ లోని ఓ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ఈ ఫుల్ గడ్డం లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు. అందుకే ఈ గడ్డం తో వచ్చే ఎపిసోడ్ ని ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ చేయనున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మే 29 నుంచి ఎ ఎమొవిఎ ఫస్ట్ షెడ్యూల్ పూణేలోని ఓ గ్రామంలో ప్రారంభం కానుంది. షూటింగ్ మొదలైతే కానీ పవన్ గడ్డం వెనుక ఉన్న మిస్టరీ వీడేలా లేదు. బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించనున్నాడు.


