‘పెదరాయుడు’కి ఇరవై ఏళ్ళు..!

Peda-rayudu
మోహన్ బాబు కెరీర్లోనే కాక, తెలుగు సినీ పరిశ్రమలోనూ గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి ‘పెదరాయుడు’. మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేయగా భానుప్రియ, సౌందర్యలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలై నేటికి ఇరవై ఏళ్ళు. ఈ సినిమాలో పాపారాయుడు పాత్రలో కొద్దిసేపు కనిపించిన రజనీకాంత్ ఈ సినిమాకు మరో హైలైట్. ఓ తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘పెదరాయుడు’కు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా అదే అనుభూతిని కలిగిస్తాయి. ‘పెదరాయుడు’ సినిమాను అలాంటి సినిమాల్లో ఒకటిగా చేర్చొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్, డ్రామా, యాక్షన్, బలమైన కథ, అద్భుతమైన డైలాగులు ఇలా ప్రతి విషయంలో సూపర్ అనిపించుకున్న ఈ సినిమా నేటికీ ఏమాత్రం పాత సినిమాగా కనిపించడం లేదంటే ఆ సినిమాలో ఉన్న మ్యాజికే అదని చెప్పుకోవాలి. తన ‘పెదరాయుడు’ సినిమా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్‌బాబు ఆ సినిమా మిగిల్చిన జ్ఞాపకాలను, అనుభూతులను గుర్తు చేసుకున్నారు.

ఓ చిన్న పాత్ర కోసం తానే స్వయంగా సిద్ధం కావడం రజనీ కాంత్‌కే చెల్లిందని మోహన్ బాబు ఈ సందర్భంగా తెలిపారు. పెదరాయుడు ఎప్పటికీ తనకు ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుందని, అద్భుతమైన కథ, ఆ కథను అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన టెక్నీషియన్స్ ఇలా ఇంతమంది కలవడం వల్లే ‘పెదరాయుడు’ ఓ మరచిపోలేని సినిమాగా నిలిచిందని మోహన్ బాబు తన అనుభవాలను పంచుకున్నారు.

Exit mobile version