మరో వివాదంలో ‘పెద్ది’.. ఈసారి ఏమైందంటే..?

మరో వివాదంలో ‘పెద్ది’.. ఈసారి ఏమైందంటే..?

Published on Jun 8, 2026 9:03 PM IST

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ, ఈ సినిమాను చుట్టుముట్టిన వివాదాలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్ర పై, మహిళా సంఘాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా చూపించారనే నెటిజన్ల ఆగ్రహానికి దర్శకుడు బుచ్చిబాబు సన స్పందిస్తూ, క్షమాపణలు చెప్పడమే కాకుండా థియేట్రికల్ వెర్షన్‌లో కొన్ని మార్పులు కూడా చేశాడు. అయితే, ఈ వివాదం సద్దుమణుగుతోందనే లోపే చిత్ర యూనిట్‌కు గిరిజన సంఘాల రూపంలో మరో కొత్త సమస్య వచ్చి పడింది.

​సినిమాలో గిరిజన సంస్కృతిని తప్పుగా చూపిస్తూ, వారిని అవమానించేలా కొన్ని డైలాగులు, పదాలు ఉన్నాయంటూ పలు ఆదివాసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హీరో చదువుకోలేదని, గిరిజన నేపథ్యం ఉన్నవాడనే కారణంతో హీరోయిన్‌ను ఆమె అనుమతి లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడాన్ని సమర్థించుకునే సీన్ తీవ్ర చర్చనీయాంశమైంది. తమ అమాయకత్వాన్ని, సంస్కృతిని నెగెటివ్ స్టెరియోటైప్స్‌తో ముడిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరిజన ప్రతినిధులు విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు అధికారికంగా ఫిర్యాదులు సమర్పించారు. అంతేకాకుండా, సెన్సార్ బోర్డు ఇలాంటి వివాదాస్పద కంటెంట్‌కు క్లియరెన్స్ ఎలా ఇచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు.

​ప్రస్తుతం ఈ వివాదం మరింత ముదిరింది. గిరిజన సమాజం పట్ల అవమానకరంగా ఉన్న ఈ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు సినిమా కలెక్షన్లతో దూసుకుపోతుంటే, మరోవైపు ఈ వరుస వివాదాలు ‘పెద్ది’ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారాయి. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు