అవికా గోర్ బర్త్ డే స్పెషల్ గా ‘పాప్ కార్న్’ మోషన్ పోస్టర్ లాంచ్.!

Published on Jun 30, 2021 4:00 pm IST

యంగ్ హీరో సాయి రోనక్ హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అవికా గోర్ హీరోయిన్‌గా ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘నెపోలియన్’తో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఆచార్య క్రియేషన్స్‌ అధినేత భోగేంద్రగుప్తా మదుపల్లి ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మిస్తున్న చిత్రమిది.

మరి అవికా స్క్రీన్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన అవికా గోర్, ఎంఎస్ చలపతిరాజు సహ నిర్మాతలు. ఈ చిత్రానికి ‘పాప్ కార్న్’ టైటిల్ ఖరారు చేశారు. బుధవారం (జూన్ 30) అవికా గోర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించడంతో పాటు టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.ఆచార్య క్రియేషన్స్ సంస్థలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మూడో చిత్రమిది. ఈ సినిమాతో అవికా గోర్ నిర్మాతగా మారుతుండటం మరో విశేషం.

వాణిజ్య ప్రకటనల రంగంలో పద్దెనిమిదేళ్లు అనుభవం గల, సొంతంగా ఓ యాడ్ ఏజెన్సీ ఉన్న మురళీ నాగ శ్రీనివాస్ గంధం ‘పాప్ కార్న్’తో దర్శకుడిగా మారుతున్నారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమాను నిర్మించడానికి అవికా గోర్ ముందుకు వచ్చారు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అంచనాలకు తగ్గట్టు మోషన్ పోస్టర్ ఉందని విడుదలైన కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. సాయి రోనక్, అవికా గోర్ స్టిల్ చూస్తుంటే… ఈతరం యువతీయువకులకు సంబంధించిన ప్రేమకథలా ఉందని ఆడియన్స్ అంటున్నారు.

మరి ఈ సందర్భంగా భోగేంద్రగుప్తా మదుపల్లి మాట్లాడుతూ “మా కథానాయిక అవికా గోర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. అవికా గోర్ నిర్మాణ భాగస్వామ్యంలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు. త్వరలో ఇతర నటీనటులు వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.

అలాగే దర్శకుడు మురళీ నాగ శ్రీనివాస్ గంధం మాట్లాడుతూ “మెలోడ్రామా జానర్ లో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం కల ఓ అమ్మాయి, ఓ అబ్బాయి… తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. అంతకు ముందు వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. తప్పించుకోవడానికి వీలు లేని చోటు ఆ ఇద్దరూ… ఎలా టైమ్ పాస్ చేశారు? ప్రమాదకరమైన పరిస్థితి వచ్చాక ఏం చేశారు? ఆ తర్వాత ఏమైందనేది కథ” అని అన్నారు.

సాయి రోనక్, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), కాస్ట్యూమ్ డిజైనర్: మనోహర్ పంజా, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్, సహ నిర్మాతలు: అవికా గోర్, ఎంఎస్ చలపతి రాజు, నిర్మాత: భోగేంద్రగుప్తా మడుపల్లి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మురళీ నాగ శ్రీనివాస్ గంధం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :