బాహుబలి కొత్త పోస్టర్ : భయంకర ‘కాళకేయ’!

బాహుబలి కొత్త పోస్టర్ : భయంకర ‘కాళకేయ’!

Published on May 11, 2015 8:10 PM IST

baahubali1
దర్శకుడు రాజమౌళికి ప్రమోషనల్ కార్యక్రమాల్లో కొత్త పంథాను సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. ‘మగధీర’ సినిమా నుంచి ఈ తరహా ప్రమోషన్లతో సినిమాపై క్రేజ్‌ను అమాంతం పెంచేసే టెక్నిక్‌ను వాడుకుంటూ వస్తున్నారు రాజమౌళి. తాజాగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు కూడా ఇప్పట్నుంచే సరికొత్త ప్రమోషన్‌కు శ్రీకారం చుట్టారు. బాహుబలి సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు ఉన్నందున ఈ సమయంలో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చడానికి బాహుబలి టీమ్ సరికొత్త ప్రణాళికలు రూపొందించింది.

‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మే 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈలోగా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్తేజాన్ని పెంచడానికి సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన వారి పోస్టర్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే మే 1న బాహుబలి ఫస్ట్‌లుక్ పోస్టర్, మే 4న శివుడు పాత్రలో నటించిన ప్రభాస్ పోస్టర్, మే 6న దేవసాన పాత్రలో నటించిన అనుష్క పోస్టర్‌ల, మే 8న శివగామిగా నటించిన రమ్యకృష్ణ పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ వరుసలో ‘కాళకేయ’గా నటించిన ప్రభాకర్ పోస్టర్‌ను ఈ సాయంత్రం విడుదల చేశారు.

‘మర్యాద రామన్న’ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాకర్ ఈ సినిమాలో లక్షమంది బార్బేరియన్లకు సైనికుడిగా కనిపించనున్నారు. “రక్తం అతడి దాహాన్ని తీరుస్తుంది. యుద్ధం అతడికి శాంతినిస్తుంది” అంటూ రాజమౌళి ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అతి భయంకరుడిగా ఉన్న కాళకేయను చూడొచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను మే 31న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు