దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ దేశం ఎదురు చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు పెద్ద సంస్థలు ముందుకు రావడం బాహుబలి క్రేజ్‌కి ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాగా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు మరో రెండు నెలలు ఆ ఎదురుచూపులు తప్పవు.
అయితే ఎలాగూ సినిమా విడుదల ఇప్పట్లో లేకపోవడంతో సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచడానికి బాహుబలి టీమ్ కొత్త ప్లాన్ వేసింది. మే 31న ‘బాహుబలి’ మొదటి భాగం ట్రైలర్‌ను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. దీనికోసం ఇప్పట్నుంచే ప్రచారం మొదలుపెట్టేశారు. ముందే చెప్పినట్టుగా మే 1వ తేదీ నుండి సినిమా పోస్టర్లను విడుదల చేయడం ప్రారంభించారు. మే 1న విడుదల చేసిన పోస్టర్‌లో ఓ స్త్రీ పసివాణ్ణి తన చేతుల్తో సముద్రం మధ్యలోనుంచి పైకెత్తి పట్టుకున్న పోస్టర్‌ను చూశాం. ఆ పోస్టర్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘బాహుబలి’ ఓ వండర్‌గా నిలవనుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఆ పోస్టర్ తాలూకు ఉత్సాహం అభిమానుల్లో ఇప్పటికీ కొనసాగుతుండగా దానికి కొనసాగింపుగా ఈ సాయంత్రం విడుదల చేసిన శివుడు పోస్టర్ మరింత ఉత్తేజాన్నిచ్చింది. ఓ భారీ శివలింగాన్ని తన నెత్తినెత్తుకున్న ప్రభాస్‍ను ఈ పోస్టర్‍లో చూడొచ్చు. ఈ పోస్టర్ థీమ్‍కి, ప్రభాస్ బలిష్టమైన శరీరాకృతికి అద్భుతమైన స్పందన వస్తోంది. పోస్టర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే బాహుబలి హాష్‌ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌గా నిలిచింది.
“ఆ గంగను మోసిన జంగమదేవుని నెత్తిన మోసినదెవడు! నరనరమున సత్తువ ఉరకలు వేసిన నరోత్తముడు ఎవడు!” అన్న ప్రశ్నలను వదులుతూ రాజమౌళి ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడే ఇంత సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెంత సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగాన్ని ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలుస్తున్నారు.


