
దర్శకుడు క్రిష్ ఎంతో ఇష్టపడి తన కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటూ వచ్చిన ‘కంచె’ సినిమా, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే! రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన మొట్టమొదటి ఇండియన్ సినిమా కావడంతో మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాపై విడుదల తర్వాత ప్రశంసల వర్షం కురుస్తోంది. దర్శకుడు క్రిష్ మేకింగ్, హీరో హీరోయిన్లు వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్‌ల నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో మెప్పిస్తూ వెళుతోన్న ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు ప్రగ్యా జైస్వాల్ ద్వారా ఓ ప్రతిభాశాలి అయిన హీరోయిన్ కూడా పరిచయమవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. లుక్స్ ద్వారా కట్టిపడేసిన ప్రగ్యా, సీతాదేవీ పాత్రలో ఒదిగిపోయి నటించడం అందరినీ ఆకట్టుకుంటోంది. కంచె సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రగ్యా జైస్వాల్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రగ్యా జైస్వాల్ ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చేసుకున్నారు. ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు తనకు ఫోన్ చేసి అభినందించడం ఎంతో సంతోషిస్తున్నదని ప్రగ్యా ఈ సందర్భంగా తెలిపారు.