
ఎలాంటి పాత్రనైనా తన విలక్షణ నటనతో రక్తికట్టించగల నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. తాజాగా ఆయన బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలతో పాటు, మంచి బాక్సాఫీస్ కలెక్షన్లను సైతం సొంతం చేసుకున్న ‘జాలీ ఎల్ఎల్‌బీ’ తమిళ రీమేక్‌లో నటించనున్నారు. బొమాన్ ఇరానీ, అర్షద్ వార్షి ప్రధాన పాత్రల్లో నటించగా 2013లో విడుదలైన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’, ఆ సంవత్సరానికి ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమా కోసం సన్నాహాలు చేసుకున్నారు.
అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రీమేక్‌లో బొమన్ ఇరానీ పాత్రను ప్రకాష్ రాజ్ చేయనున్నారు. అర్షద్ వార్షి పాత్రను ఉధయ నిధి స్టాలిన్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగష్టు నెలలో ఈ రీమేక్ సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు నేపథ్యంలో సాగే ఈ సినిమా నవ్విస్తూనే సమాజంలో న్యాయం ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పిన సినిమాగా నిలిచింది.

