
ఈతరం హీరోలకు కూడా గట్టిపోటినిచ్చే సినిమాలతో దూసుకు వెళుతోన్న నందమూరి నటసింహం బాలకృష్ణ తన 99వ సినిమాకు కూడా అప్పుడే ముహూర్తం పెట్టేసిన విషయం తెలిసిందే! బాలీవుడ్‌లో పేరొందిన పెద్ద నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు కలిసి ఈ సినిమా కోసం పనిచేయడం మరో విశేషం. ఇలా ఇన్ని ప్రత్యేకతలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఒక హీరోయిన్‌గా అంజలి ఎంపిక జరిగిపోగా, మరో హీరోయిన్ కోసం సినిమా యూనిట్ వెతుకులాటలో పడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ‘అత్తారింటికి దారేదీ’ తర్వాత తెలుగు, తమిళ పరిశ్రమల్లో వరుస అవకాశాలను అంది పుచ్చుకుంటున్న ప్రణీతను బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏదీ విడుదల కాలేదు.

