సమీక్ష : ప్రేమ క‌థా చిత్ర‌మ్‌ 2 – బోర్ గా సాగే హర్రర్ కామెడీ !

Prema Katha Chitram 2 movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని, ప్రభాస్ శ్రీను , విద్యుల్లేక రామన్ త‌దిత‌రులు.

దర్శకత్వం : హరికిషన్

నిర్మాత :  సుదర్శన్ రెడ్డి

సంగీతం : జేబీ


నూతన దర్శకుడు హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్లుగా సూపర్ హిట్ హారర్ కామెడీ మూవీ ప్రేమకథాచిత్రమ్ కు సీక్వెల్ గా వచ్చిన చిత్రం ‘ప్రేమ కథా చిత్రమ్ 2’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

సుదీర్ (సుమంత్ అశ్విన్)ను అతని బిహేవియర్ ను చూసి బిందు (సిద్ది ఇద్నాని) సుదీర్ ను సిన్సియర్ గా ప్రేమిస్తోంది. కానీ సుదీర్ అప్పటికే నందు (నందితా శ్వేతా)ను ప్రేమిస్తున్నానని.. బిందు ప్రేమను రిజెక్ట్ చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం నందు సుదీర్ తో ఏకాంతగా గడపడం కోసం ఒక ఫామ్ హౌస్ కి తీసుకోస్తోంది. ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనల తరువాత నందుకి చిత్ర అనే దెయ్యం పట్టిందని సుదీర్ కి తెలుస్తోంది. అసలు చిత్ర ఎవరు ? చిత్రకి సుదీర్ కి ఉన్న సంబంధం ఏమిటి ? చిత్ర, సుదీర్ మీద ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటుంది ? చివరికి సుదీర్, చిత్ర నుండి నందును ఎలా కాపాడుకున్నాడు ? ఈ క్రమంలో బిందు ఏమైపోయింది ? చివరగా సుదీర్ అండ్ నందు కలిసారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా సుమంత్ అశ్విన్ నటన బాగుంది. సినిమాలోని ప్రీ క్లైమాక్స్ లో వచ్చే హర్రర్ సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

ఇక హీరోయిన్ గా నటించిన సిద్ది ఇద్నాని నటన పరంగా కంటే కూడా గ్లామర్ పరంగా బాగా ఆకట్టుకుంది. అలాగే సినిమాలోనే కీలకమైన పాత్రలో నటించిన నందితా శ్వేతా కొన్ని హర్రర్ సీన్స్ లో అవలీలగా నటించింది. అలాగే చిత్ర పాత్రలో నటించిన నటి కూడా బాగా చేసింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు హరికిషన్ తను రాసుకున్న కథ కథనంలో ఎక్కడా ప్లో లేకపోగా, అనవసరమైన కామెడీ సీన్స్ పెట్టి.. ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆ కాస్త ఆసక్తిని కూడా నీరుగార్చాడు. మొత్తానికి దర్శకుడు సినిమాలోని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ను పక్కన పెట్టి.. పండని కామెడీ అండ్ హార్రర్ సీన్స్ తో కథను డైవర్ట్ చేసారు. అలాగే కథకు అవసరం లేని అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సన్నివేశాలు అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా బాగా విసుగు తెప్పిస్తోంది.

అసలు సినిమాలో.. అన్నిటికి మించి… ఓ దెయ్యం తన కోరిక నెరవేర్చుకునే క్రమంలో.. హీరో ఏం అయిపోతాడో.. ఎలాంటి ఇబ్బందులకు గురవుతాడో.. అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ అండ్ టెన్షన్ ను ఎలివేట్ చేసే అవకాశం చాలా చోట్ల ఉన్నా… దర్శకుడు మాత్రం ఆ కంటెంట్ ను పెద్దగా వాడుకోకుండా.. హార్రర్ ఎఫెక్ట్స్ మీద.. ఆర్టిస్ట్ ల నుండి ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ తీసుకోవడం పైనే ఎక్కువ శ్రద్ద పెట్టాడు.

ఓవరాల్ గా సినిమా నెమ్మదిగా సాగుతూ బాగా బోర్ కొట్టిస్తోంది. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని మలచలేకపోయారు. ఆయన స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు హరికిషన్ ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు.
సంగీత దర్శకుడు జేబీ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది.

ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. ఇక సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. హర్రర్ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

తీర్పు :

హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్లుగా ‘ప్రేమకథాచిత్రమ్’ కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. కాకపోతే సినిమాలోని ప్రీ క్లైమాక్స్ లో వచ్చే హర్రర్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కానీ
దర్శకుడు రాసుకున్న కథా కథనాల్లో ప్లో లేకపోవడం, సినిమాలో కథకు అనవసరమైన పండని కామెడీ సీన్స్ ఎక్కువుగా ఉండటం.. అన్నిటికి మించి సినిమా ఆసాంతం స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version