‘ప్రేమమ్’ కొత్త రిలీజ్ డేట్!

Premam-m
మళయాలంలో సంచలన విజయం సాధించిన ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులో అదే పేరుతో అక్కినేని నాగ చైతన్య రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఫస్ట్‌లుక్‌తో మంచి అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా గురించి ‘ప్రేమమ్’ మళయాల వర్షన్‌ను ఇప్పటికే చూసి ఉన్న, తెలుగులో సినిమాను చూడాలనుకుంటున్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొదట్లో ఆగష్టు 12న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించినా, ఆ తర్వాత ఆ విడుదల తేదీని పక్కనబెట్టేశారు. ఇక ఆ తర్వాత మళ్ళీ కొత్త విడుదల తేదీ ఎప్పుడనేది కూడా ప్రకటించలేదు.

కాగా తాజాగా మా విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి, ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేయాలని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ’తో పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటిస్తోన్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. గోపీ సుందర్, రాజేష్ మురుగేశన్ అందించిన ఆడియో ఆగష్టులో విడుదల కానుంది.