ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ తెలుగు చిత్ర పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టొవినో థామస్ నటించిన మలయాళ చిత్రం ‘పళ్లిచట్టంబి’ తెలుగు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగులో కంటే మలయాళంలోనే థియేట్రికల్ రెవెన్యూ ఎక్కువగా ఉంటోందని అన్నారు. మలయాళంలో ఉన్న కంఫర్ట్ ఇక్కడ లేదని, తెలుగులో సినిమాలు నిర్మించాలంటే నిర్మాతలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తెలుగు థియేటర్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థల మనుగడ కోసమే ఇతర భాషల చిత్రాలను ఇక్కడ విడుదల చేస్తున్నట్లు బన్నీ వాస్ తెలిపారు. ఈ క్రమంలోనే ‘పళ్లిచట్టంబి’ చిత్రాన్ని ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగువారే కేరళ వెళ్లి ఈ భారీ కమర్షియల్ చిత్రాన్ని నిర్మించడం విశేషం. టొవినో నటన అద్భుతంగా ఉందని, నటి కయదు లోహర్ ఈ చిత్రంతో తెలుగులో మరింత మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని ఆయన ప్రశంసించారు.
దర్శకుడు మారుతి పరిచయం చేసిన ఈ చిత్ర బృందం, సాంకేతికంగా అత్యున్నత విలువలతో ఈ సినిమాను తెరకెక్కించిందని బన్నీ వాస్ కితాబిచ్చారు. ఇదే వేదికపై అల్లు అర్జున్ అభిమానులకు ఆయన ఓ శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా టైటిల్, పోస్టర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


