ఇంటర్వ్యూ : నిర్మాత నాగ్ అశ్విన్ – ‘సింగ్ గీతం’ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు..!

ఇంటర్వ్యూ : నిర్మాత నాగ్ అశ్విన్ – ‘సింగ్ గీతం’ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు..!

Published on Jun 6, 2026 10:05 PM IST

Nag-Ashwin-1

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు చాలా కాలం తర్వాత రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సింగ్ గీతం’. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని జూన్ 11న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్మాత నాగ్ అశ్విన్ ఈ చిత్ర విశేషాలను విలేకర్ల సమావేశంలో పంచుకున్నారు.

‘సింగ్ గీతం’ ప్రయాణం ఎప్పుడు మొదలైంది?

ఈ సినిమా ప్రయాణం దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారితోనే మొదలైంది. ఆయన ‘పుష్పక విమానం’ కంటే ముందే ఈ కథను కమల్ హాసన్‌కు చెప్పినప్పటికీ, బిజీ షెడ్యూల్స్ వల్ల ఇప్పటికి కుదిరింది. ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ లాగే సింగీతం గారి సినిమాలు ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటాయి. మాయాబజార్ సినిమా నుంచి ఆయన నేర్చుకున్న మెలకువల వల్లే, ఇప్పటికీ ఆయన కథలు ఈ తరం కోసం రాసినట్టుగా, ఎంతో రిలవెంట్‌గా అనిపిస్తాయి.

నిర్మాతగా కొంతగ్యాప్ తర్వాత ఏ అంశాలు ఎక్సైట్ చేశాయి..?

సినిమా నిర్మించడం నా ఫస్ట్ జాబ్ కాదు. ఒక కథ నచ్చి, ఆ కథను ఇంకెవరూ చేయలేరనిపించినప్పుడే నేను నిర్మిస్తాను. సింగ్ గీతం కూడా చాలా ప్రత్యేకమైన సబ్జెక్ట్. సింగీతం గారి విజన్‌పై, ఆయనపై ఉన్న ప్రేమతో ఈ సినిమాను చేశాను.

సింగీతం గారి వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది?

ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది నెలలు రైటింగ్, ఆపై రిహార్సల్స్ చేశారు. సింగీతం గారు ఎంతో స్పాంటేనియస్‌గా ఉంటారు. తన తప్పులను కూడా సహజంగా ఒప్పుకుంటారు. అలాంటి గొప్ప దర్శకుడిని కలవడమే భాగ్యమైతే, ఆయనతో రెండేళ్లు కలిసి ప్రయాణించి, ప్రతిరోజూ మాట్లాడుతూ సినిమా చేయడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని, గౌరవాన్ని ఇచ్చింది.

ఈ సినిమాలో మీ ఇన్‌పుట్స్ ఏమైనా ఉన్నాయా?

94 ఏళ్ల వయసులోనూ సింగీతం గారు కొత్త తరం దర్శకుడిలా ఈ సినిమాను ఒక టీనేజర్ మైండ్‌సెట్‌తో తీశారు. ఆయన విజన్‌ను స్క్రీన్‌పైకి తెచ్చేందుకు నేను ప్రొడక్షన్‌లోనే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌లా కూడా ప్రతి అడుగులో సాయపడ్డాను. వారం రోజుల్లో మర్చిపోయేలా కాకుండా పదేళ్ల తర్వాత కూడా గుర్తుండిపోయేలా ఈ సినిమాను రూపొందించాం.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఎంత ఎక్సైట్ అయ్యారు..?

దేవిశ్రీ ఒక లెజెండ్. మ్యూజిక్ పరంగా ఇది చాలా ఛాలెంజింగ్ సినిమా. ఈ సినిమాలో నాన్‌స్టాప్ మ్యూజిక్ ఉంటుంది. కానీ ఎక్కడా “మ్యూజిక్ వింటున్నాం” అనే ఫీలింగ్ రాదు.

అయాన్, అహల్య, శాలిని గురించి?

అయాన్, అహల్య చాలా టాలెంటెడ్ పెర్ఫార్మర్స్. వారికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అయాన్, శాలిని తెలుగువారు. అహల్య తెలుగు నేర్చుకుంది. వీళ్లకు భవిష్యత్తులో చాలా మంచి అవకాశాలు వస్తాయి.

కల్కి 2 గురించి?

కల్కి 2 ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి కంటిన్యుగా షూటింగ్ చేసి శరవేగంగా పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నాం.

తాజా వార్తలు