
నటుడు పృథ్వీ తెలుసా అనడిగితే గుర్తు పట్టడానికి టైం తీసుకుంటారేమో, అదే ’30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ’ తెలుసా? అంటే మాత్రం టక్కున గుర్తొచ్చేస్తారు. ‘ఖడ్గం’ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అన్న డైలాగ్‍తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న పృథ్వీ తాజాగా తెలుగులో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. ఆ మధ్య వచ్చిన ‘లౌక్యం’ సినిమాతో తన స్థాయిని పెంచుకున్న పృథ్వీ, తాజాగా ‘శంకరాభరణం’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలతో స్టార్ కమెడియన్‌గా మారిపోయారు. గత కొద్దికాలంగా కథలో భాగమయ్యే పాత్రలకే పరిమితమైన పృథ్వీ ప్రస్తుతం కథను మలుపుతిప్పే పాత్రలతో మెప్పిస్తున్నారు.
ఈనెల్లోనే ‘శంకరాభరణం’, ‘బెంగాల్ టైగర్’ ఇలా రెండు క్రేజ్ ఉన్న సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి మెప్పించిన పృథ్వీ, ఈనెల తనకెంతో ప్రత్యేకమని చెబుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఓ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వేషం వస్తే చాలు అనుకునేవాడిని. ఇప్పుడు పెద్ద పెద్ద పాత్రలు చేస్తున్నా. ఈ నెలను ఎప్పటికీ మరచిపోలేను. ‘శంకరాభరణం’, ‘బెంగాల్ టైగర్’ ఇలా రెండు సినిమాలు నాకు ఎప్పుడూ లేనంత క్రేజ్‌ను తీసుకొచ్చాయి. ఇండస్ట్రీలో తొక్కేయడాలు లాంటివి ఉండవు. మన వల్ల సినిమాకు ఉపయోగం ఉందనుకుంటే అవకాశాలు అవే వస్తాయి.. కొంచెం లేట్ అయినా కూడా! ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో మొదలైన ఈ ప్రయాణం ‘ఖడ్గం’తో ఒక లెవెల్‌కి, ఇప్పుడీ వరుస సినిమాలతో మరో లెవెల్‌కి వెళ్ళింది. ప్రస్తుతానికి వ్యక్తిగతంగా, వృత్తి పరంగా పరిపూర్ణమయ్యా. అందరి సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని అనుకుంటున్నా” అని అన్నారు.

