హైదరాబాద్ : ఫిబ్రవరి : 14
భారతదేశ ఆధ్యాత్మికత అంటే దేశ దేశాల్లో గుర్తుకొచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణాకి ప్రసాదించిన అద్భుతమైన వరం హైదరాబాద్ లోని జూబిలీహిల్స్ లో ఒక మహా విశాల ప్రాగణంలో ఏడేళ్లనాడు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అపూర్వ దేవాలయమనే చెప్పాలి. రేపు మంగళవారం నుండి ప్రారంభం కాబోయే ఈ ఆలయ ఆరవ బ్రహ్మోత్సవాల్లో ఈ సంవత్సరం ఒక విశేషాన్ని స్వామి వారి అనుగ్రహంతో భక్త శ్రేష్ఠులకు ప్రసాదించబడటం గమనార్హం.
తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పణలో నడుస్తున్న ఈ అపూర్వ ఆలయ ఆరవ బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రిక చాలా చక్కగా రూప కల్పనా చేయడమే కాకుండా …. ఈ ఉత్సవాల ఆహ్వాన పత్రికతోపాటు ఆలయ అధికారులు శ్రీమాలిక అనే నాలుగువందలపేజీల మహోజ్వల గ్రంధాన్ని కూడా దాతలకు, భక్తులకు గత వారం రోజులుగా అందివ్వడంతో జంటనగరాలకు చెందిన అనేకమంది పారిశ్రామిక వేత్తలు, శ్రీవారి భక్త బృందాలు అభినన్దనలు వర్షిస్తున్నాయి. ఈ ఆలయ బ్రహ్మోత్సవాల విశేషాలను సైతం పవిత్రంగా ప్రచురింపచేసి … తిరుమల ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆశీస్సులతో ప్రఖ్యాత వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ , బీ ఎస్ సి పీ ఎల్ ఇన్ఫ్రా కంపెనీ ఫౌండర్ , మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య, శ్రీమతి సుజాత దంపతుల సౌజన్యంతో ఈ దివ్య ఆహ్వాన పత్రిక అందరికీ అందించబడటం జరుగుతున్నట్లు స్పష్టమౌతోంది.
ఇప్పటికే తిరుమల, ఇంద్రకీలాద్రి, వేదాద్రి, యాదాద్రి, అన్నవరం, ద్వారకా తిరుమల, మంగళగిరి , వేములవాడ రాజన్న , ఓరుగల్లు భద్రకాళి , సింహాచలం వంటి అనేక మహా పుణ్య క్షేత్రాల్లోనే కాకుండా ఎన్నో పీఠాల్లో , మఠాల్లో , ధార్మిక పరిషత్ , ధార్మిక మండళ్లలో వేల వేల గ్రంథ రాజాలతో , అద్భుతమైన శైలితో , అతి అరుదైన గ్రంధాలతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ ఈ శ్రీమాలిక (Sreemaalika Book) మహా గ్రంధానికి రచన సంకలనకర్త కావడంతో ఈ బుక్ కి మరింత ప్రాధాన్యత పెరిగిందనేది తెలుస్తోంది.
జూబిలీ హిల్స్ శ్రీవేంకటేశ్వరుని దేవస్థాన అధికారులనుండి బ్రహ్మోత్సవాల ప్రత్యేక ఆహ్వాన పత్రికలతో పాటు ఈ శ్రీమాలిక మహా గ్రంధాన్ని అందుకున్న హర్ష టొయోట అధినేత ముప్పవరపు హర్షవర్ధన్, శ్రీమతి ముప్పవరపు రాధ దంపతులు, పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాపరెడ్డి , శ్రీమతి లక్ష్మి దంపతులు , జీవీకే గ్రూప్ యాజమాన్యం ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చడం … బొల్లినేని కృష్ణయ్య ఇంతటి చక్కని పవిత్రకార్యాన్ని భుజాలకెత్తుకుని శ్రీవారికి సమర్పించడం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. వజ్ర నఖాలతో హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీలుస్తున్న మహాద్భుత సన్నివేశాన్ని దివ్యమంగళంగా ముఖ చిత్రంపై ముద్రించడం వల్ల శ్రీమాలిక చాలా ఆకర్షణీయంగా ఉందని ఆలయ అర్చకులు ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వరుని ఆలయ బ్రహ్మోత్సవాల చరిత్రలో ఈ నాలుగు వందల పేజీల మహోదాత్త గ్రంధం ఎంతో పవిత్రంగా నిలుస్తుందని. ఇది బొల్లినేని కృష్ణయ్యకు, పురాణపండ శ్రీనివాస్ కు శ్రీవారి పుష్కల అనుగ్రహమేనని ఆలయవర్గాలు పేర్కొంటున్నాయి. శనివారం ఆలయ ప్రాంగణంలో అర్చకుల సమక్షంలో … ఆలయానికి మూడువేల శ్రీమాలిక ప్రతులను బొల్లినేని కృష్ణయ్య అందజేశారు. తిరుమల సంప్రదాయం ప్రకారం ఆలయంలో ఏ గ్రంధాన్ని ఆవిష్కరించకూడదు కనుక ఆలయ అధికారుల సూచన మేరకు ధ్వజస్థంభంకి ముందు మహాద్వారంవద్ద వినాయకుని చెంత … బేడీ ఆంజనేయస్వామి ఎదురుగా శ్రీమాలిక రచనా సంకలన కర్త పురాణపండ శ్రీనివాస్ తో కలిసి బొల్లినేని కృష్ణయ్య ఈ గ్రంధాన్ని ఆవిష్కరించారు.
జన్మలో ఇదొక భాగ్యంగా భావిస్తున్నామని, కేవలం ఇది తిరుమల శ్రీనివాసుని లావణ్య వైభవ అనుగ్రహమేనని ఏ సందర్భంగా కృష్ణయ్య వినయంగా పేర్కొనడం ఆలయ, భక్త బృందాల్ని ఆకట్టుకుంది. ఒక మంచి వక్త , ఎంచక్కని పవిత్రసొగసుల భాషా ప్రయోగాలతో లక్షలకొలది అభిమానుల్ని సంపాదించుకున్నపురాణపండ శ్రీనివాస్ పుస్తకాలెన్నో ఇప్పటికే తిరుమల అర్చకుల, ప్రధానార్చకులు, పండితుల , వేద పండితుల, వేదపాఠశాలలో సైతం పారాయణలుగా గత కొంతకాలంగా దర్శనమిస్తున్నాయనే విషయాలన్నీ తిరుమల ఆలయ అధికార బృందాలే పేర్కొనడం శ్రీవారి మంగళ అనుగ్రహంగా ఆశ్చర్యమైన ఆనందంగా దర్శనమివ్వడం విశేషం.
