యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంత, ప్రణిత నటీనటులుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రభస’. లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ గణేష్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ స్వరపరిచిన ఈ సినిమా ఆడియో శుక్రవారం శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు రాజమౌళి, వివి వినాయక్, వంశి పైడిపల్లి, దిల్ రాజు తదితర ప్రముఖులు హాజరయ్యారు.
‘ 14 ఏళ్ళ క్రితం ఒక తల్లిదండ్రికి బిడ్డగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఈ రోజు తండ్రి స్థాయిలో మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారు. నా ప్రస్థానంలో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మా తాతగారి ఆశీర్వాదం, మీ అండ ఎప్పుడూ నాపై ఉంది. అలాగే నా బిడ్డపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ‘రభస’ విషయానికి వస్తే సంతోష్ శ్రీనివాస్ 10 నెలలు కష్టపడి సినిమాను రూపొందించాడు. మధ్యలో అనారోగ్యం పాలైనా, సినిమా కోసం చాలా శ్రమించాడు. అతని కోసమైనా సినిమా హిట్ కావాలి. తమన్ మరోసారి అద్బుతమైన ఆడియో ఇచ్చాడు. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. మీ కోసం మీ తల్లిదండ్రులు, పిల్లలు ఎదురు చూస్తుంటారు’ అని ఎన్టీఆర్ అన్నారు.
దర్స్దకుడు సంతోష్ శ్రీనివాస్ వేదికపై ఎమోషనల్ అయ్యారు. కామెర్లతో భాదపడుతున్న సమయంలో ఎన్టీఆర్, నిర్మాత బెల్లకొండ సురేష్ ఇచ్చిన ధైర్యం మరువలేనిదని అన్నారు. వాళ్ళ ఋణం తీర్చుకోలేదని చెప్పారు. ఎన్టీఆర్ కథ ఓకే చేశాకా అయన కోసం మరిన్ని కమర్షియల్ హంగులు జత చేశామని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులకు విందు భోజనంలాగా ఉంటుందని అన్నారు. ‘ఆది’ అనుకోకుండా హిట్ అయ్యింది, ‘రభస’ అనుకుని చేసిన హిట్ సినిమా అని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు సినిమా విజయం సాదించాలని ఆకాంక్షించారు.


