గత సంవత్సరం వేసవి కానుకగా విడుదలై అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా రేసుగుర్రం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మాత. అన్నదమ్ముల మధ్యనుండే చిన్న చిన్న గొడవలు, ప్రేమా, ఆప్యాయత, కుటుంబ విలువలతో పాటు మంచి యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఆద్యాంతం తెలుగు ప్రేక్షకుడిని కట్టిపడేసింది. శృతిహాసన్ కథానాయికగా నటించగా, థమన్ సంగీతాన్ని సమకూర్చారు.
తాజాగా ఈ సినిమా ప్రతిష్టాత్మక బి. నాగిరెడ్డి పురస్కారానికి ఎంపికైంది. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్నో మరపురాని సిమాలు నిర్మించిన బి. నాగిరెడ్డి తెలుగు సినిమాకు ఎంతో కృషి చేశారు. ఆయన స్మారకంగా ప్రతీయేటా బి. నాగిరెడ్డి జాతీయ పురస్కారాల పేరిట మంచి సినిమాలకు అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. 2014 సంవత్సరానికి గాను సకుటుంబ వినోదాత్మక చిత్రంగా రేసుగుర్రం సినిమాను గుర్తించారు. ఈనెల 19న కృష్ణ, విజయనిర్మల చేతులమీదుగా రేసుగుర్రం నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ఈ అవార్డు అందుకోనున్నారు.


