2009 లో బంపర్ ఆఫర్ సినిమాలో వచ్చిన ‘ఎందుకే రమణమ్మ’ సాంగ్ గుర్తుందా.! అదెలా మరచిపోతాం లెండి.. ఈ పాట అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటని కంపోజ్ చేసింది సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె. మళ్ళీ తాజాగా రఘు కుంచె తను చేసిన ‘సోషల్ నెట్వర్క్ అండి బాబు’ పాటతో క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మంజునాథ్ డైరెక్ట్ చేసిన ‘లేడీస్ & జెంటిల్ మెన్’ సినిమాకోసం చేసిన ఈ ప్రమోషన్ సాంగ్ ప్రస్తుతం ఓ వైరస్ లా సోషల్ నెట్వర్క్స్ లో హల్ చల్ చేస్తోంది. అలాగే నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ సాంగ్ పై రఘు కుంచె స్పందిస్తూ ‘ గతంలో ఎందుకె రమణమ్మ సాంగ్ మేము పూర్తి చేసి రిలీజ్ చేసినప్పుడు అది ప్రజలకు రీచ్ అవ్వడానికి కాస్త టైం పట్టింది. ఎందుకంటే అది ఒక ఆడియో ట్రాక్ మాత్రమే.. బంపర్ ఆఫర్ రిలీజ్ అయ్యే టైంకి సోషల్ మీడియా కూడా అంతగా డెవలప్ కాలేదు. కానీ పాట మాత్రం చాలా ఫాస్ట్ గా క్లిక్ అయ్యింది. నిజం చెప్పాలంటే నేను కూడా నా పోస్ట్ కి ఎన్ని లైక్స్ వస్తాయా అని లెక్కించుకుంటూ కూర్చున్నాను. ఈ చిత్ర టీం కూడా ఈ పాటని ఈ సినిమాలో ఎక్కడన్నా పెట్టడానికి లేదా సినిమా చివరిలో పెట్టడానికి ఆలోచిస్తున్నారు. ఈ పాటలో ఎప్పుడైతే ముగ్గురం కలిసి ఓ గెటప్ వేసుకొని షూట్ చేసామో అప్పుడే ఈ పాటకి మరింత వాల్యూ వచ్చిందని’ అన్నాడు.
ఈ పాటలో పూజారులు వేసుకునే డ్రెస్ లో డార్క్ గ్లాసెస్ పెట్టుకొని రఘు కుంచె కనిపిస్తే, అతని పాటు అందరినీ ఆకట్టుకునే లుక్ లో నోయెల్, జూనియర్ రేలంగి కలిసి లోకల్ ట్రైన్ లో ప్రయాణికులతో పాటు కలిసి సందడి చేస్తూ ఈ పాటని ఆలపించారు. ప్రస్తుతం నెటిజన్స్ ఫేస్ బుక్, ట్విట్టర్, వ్హాత్స్ అప్ అంటూ ఎలా తలమునకలైపోతున్నారో ఈ పాటలో తెలిపారు.
ఈ పాటకి లిరిక్స్ ని సిరాశ్రీ రాసాడు, ‘పాత కాలం నాటి ఫోక్ ఫార్మాట్ ని తీసుకొని దానిని సోషల్ నెట్వర్క్ థీమ్ కి కనెక్ట్ చేసాం. ఈ పాటలోని రాప మ్యూజిక్ యువతని అట్రాక్ట్ చేస్తే, బుర్ర కథ కాన్సెప్ట్ ఓల్డ్ పీపుల్ ని ఆకట్టుకుంది. సాంగ్ ని మేము స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తూ వచ్చాము. ఒక్క రాత్రి కూర్చొని చేసిన సాంగ్ కాదు. ఈ పాట ఎందుకే రమణమ్మ వచ్చిన వెంటనే వచ్చి ఉంటే అందరికీ బోర్ కొట్టి ఉండేది. గత కొంతకాలంగా ప్రేక్షకులు ఏమి మిస్ అవుతున్నారో దాన్నే ఇందులో ఇచ్చామని’ రఘు కుంచె అన్నాడు.
‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ సినిమా ఆడియోని జూలై మొదటి వారంలో రిలీజ్ చేసి సినిమాని జూలై మూడవ వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. రఘు కుంచె మొట్ట మొదటి సారి మధుర శ్రీధర్ సినిమాకి సాంగ్ ఇచ్చాడు. ఈ పాట ఇక్కడి మీడియానే కాకుండా నార్త్ మీడియాని కూడా అట్రాక్ట్ చేస్తోంది.


