యంగ్ హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం “టార్టాయిస్” ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రాజ్ తరుణ్ కెరీర్‌లో 25వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం సరికొత్త థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. “హీరోకు నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఆ నిద్రలోనే నడుచుకుంటూ వెళ్లి కొన్ని హత్యలు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది” అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. సరికొత్త స్క్రీన్‌ప్లేతో రాజ్ తరుణ్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ సినిమా అవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.కె. గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్.వి.ఎల్. క్రియేషన్స్, మధుపాల మహా మూవీస్ పతాకాలపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


