రాజ్ తరుణ్ హీరోగా రిత్విక్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టార్టాయిస్’. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమృత చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘నీ పరిచయం..’ అనే మెలోడీ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చగా, చిన్మయి ఆలపించారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ఇది ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే సరికొత్త థ్రిల్లర్ చిత్రమని తెలిపారు. చంద్రబోస్, అనూప్ కాంబినేషన్లో వచ్చిన ఈ మెలోడీ సాంగ్ కథాగమనంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సినిమాలో అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణల పాత్రలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు రిత్విక్ కుమార్ వివరించారు.
చిత్ర నిర్మాతలు విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు మాట్లాడుతూ, సినిమా షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ చిత్రానికి శబరి విగ్నేష్ సినిమాటోగ్రఫీ అందించగా, గుళ్లపల్లి మాధవ్ కుమార్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
