
రాజమౌళి.. ఇండియన్ సినిమా మార్కెట్‌కు ఒక సరికొత్త దారిని ఏర్పరచి, తనదైన బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. సినిమాలతో తాను సాధించిన స్టార్‌డమ్‌ను మంచిని పంచేందుకు ఎప్పుడూ వినియోగిస్తూ ఉండే రాజమౌళి, తాజాగా ‘సిగరెట్ మానండి’ అంటూ ఓ కొత్త సామాజిక చైతన్య కార్యక్రమానికి తెరతీశారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ‘ఫైట్ స్మోకింగ్’ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాజమౌళి స్వచ్చంధంగా ప్రచారం కల్పిస్తూ తన అభిమానులకు సిగరెట్ మానమనే సలహాను బలంగా చేరవేస్తున్నారు.
ఫైట్ స్మోకింగ్ కార్యక్రమంలో భాగంగానే కార్యక్రమ నిర్వాహకులు ‘మీ జీవితానికి మీరే హీరో అవ్వండి’ అన్న కాన్సెప్ట్‌తో ఓ వీడియోను రూపొందించింది. రాజమౌళి ఈ వీడియో ద్వారా సిగరెట్ మానమనే సందేశాన్ని ప్రపంచానికిచ్చారు. “అమితాబ్ బచ్చన్, సూపర్ హీరో, క్రిష్, మహేష్ బాబు.. వీళ్ళంతా హీరోలే! అయితే నిజ జీవితంలో మీరూ హీరో అనిపించుకోవచ్చు. ఒక్క సరైన నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది. పొగ తాగడాన్ని మానండి. మీ జీవితానికి మీరే హీరో కండి” అంటూ రాజమౌళి ఈ వీడియాలో తనదైన స్టైల్లో ఓ సందేశాన్నిచ్చారు. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చేందుకు రావడం అభినందనీయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

