అమరావతికి తాను డిజైనర్ ను కాదంటున్న రాజమౌళి !

21st, September 2017 - 02:23:56 PM


‘బాహుబలి’ తో దర్శకుడిగా గొప్ప ఖ్యాతిని ఆర్జించిన రాజమౌళి ఏపి నూతన రాజధాని అమరావతికి డిజైన్ చేస్తున్నారని, నార్మన్ ఫాస్టర్ ఇచ్చిన డిజైన్ నచ్చకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు స్వయంగా రాజమౌళిని డిజైనర్ గా నియమించారని గత రెండు రోజులుగా వస్తున్న వార్తలు తెగ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన రాజమౌళి అవేమీ నిజాలు కావని తేల్చేశారు.

రాజమౌళి ట్విట్టర్లో స్పందిస్తూ ‘అమరావతికి నేను డిజైనర్ గా నియమించబడ్డాననే వార్త అవాస్తవం. అమరావతి కోసం నార్మన్ ఫాస్టర్, అతని టీమ్ ఇచ్చిన డిజైన్స్ తో చంద్రబాబుగారు చాలా సంతృప్తిగా ఉన్నారు. అయితే అసెంబ్లీ రూపకల్పన ఇంకాస్త గొప్పగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఆయన విజన్ ను నార్మన్ ఫాస్టర్ కు వివరించడమే నేను చేసే పని. నేను చేయిస్తున్న ఈ చిన్న సహకారం ఆ గొప్ప కార్యంలో ఒక సాయంగా గుర్తుండిపోతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.