ఫ్యామిలీతో వెకేషన్‌కు రాజమౌళి..!

ఫ్యామిలీతో వెకేషన్‌కు రాజమౌళి..!

Published on Jul 17, 2015 12:26 PM IST

rajamouli
దర్శక ధీరుడు రాజమౌళి మూడేళ్ళ కష్టం, తాను ఎంతగానో ఇష్టపడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ భారీ అంచనాల మధ్యన గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి విజువల్ వండర్‌ను అందించిన రాజమౌళికి అన్నిచోట్ల నుంచీ ప్రశంసలు ముంచెత్తాయి.

ఇప్పటివరకూ ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా అని మాత్రమే అనుకున్న వారికి ‘బాహుబలి’ సరైన సమాధానంగా నిలిచింది. భారతీయ సినీ పరిశ్రమ ఎప్పుడూ చూడని రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో సైతం కళ్ళు చెదిరే కలెక్షన్లు కొల్లగొడుతూ పలు హాలీవుడ్ సంస్థలను సైతం తనవైపు తిప్పుకుంది. మూడేళ్ళుగా ‘బాహుబలి’ సినిమాయే ఏకైక లక్ష్యంగా ఏర్పరుచుకొని, తన టీమ్‌కు కూడా అదే లక్ష్యాన్ని నిర్దేశించి ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు చేర్చడంలో రాజమౌళి సఫలం అయ్యారు.

ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి రాజమౌళి టీమ్ సంబరాల్లో మునిగిపోయింది. మొదటివారమే ఈ స్థాయి కలెక్షన్లను తాను కూడా ఊహించలేదని చెప్పుకొచ్చిన రాజమౌళి, ‘బాహుబలి’కి వస్తున్న రెస్పాన్స్ తనకు మంచి సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ షూటింగ్ పరిసరాలనే ఇల్లుగా భావిస్తూ పనిచేసిన రాజమౌళి, ఇప్పుడు సినిమా విడుదలై బాధ్యతలన్నీ తీరిపోవడంతో కొన్నాళ్ళు ఫ్యామిలీతో వెకేషన్‌కు బయలుదేరారు. ఫ్యామిలీతో ఈ వెకేషన్‌ను పూర్తి చేసుకున్నాక, ‘బాహుబలి ది కంక్లూజన్’ పనులతో మళ్ళీ బిజీ కానున్నారు.

తాజా వార్తలు