రాజమౌళి.. సరికొత్త ప్రమోషన్లకు కేరాఫ్!

rajamouli

దర్శకుడు రాజమౌళికి ప్రమోషనల్ కార్యక్రమాల్లో కొత్త పంథాను సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. ‘మగధీర’ సినిమా నుంచి ఈ తరహా ప్రమోషన్లతో సినిమాపై క్రేజ్‌ను అమాంతం పెంచేసే టెక్నిక్‌ను వాడుకుంటూ వస్తున్నారు రాజమౌళి. తాజాగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు కూడా ఇప్పట్నుంచే సరికొత్త ప్రమోషన్‌కు శ్రీకారం చుట్టారు. బాహుబలి సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు ఉన్నందున ఈ సమయంలో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చడానికి బాహుబలి టీమ్ సరికొత్త ప్రణాళికలు రూపొందించింది.

‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మే 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈలోగా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్తేజాన్ని పెంచడానికి సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన వారి పోస్టర్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే మే 1న బాహుబలి ఫస్ట్‌లుక్ పోస్టర్, మే 4న శివుడు పాత్రలో నటించిన ప్రభాస్ పోస్టర్, మే 6న దేవసాన పాత్రలో నటించిన అనుష్క పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ వచ్చారు.

ఈ మూడు పోస్టర్లకు బాహుబలి టీమ్ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్లన్నీ ట్రెండింగ్‌గా నిలుస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు ఈ వరుసలో నాలుగో పోస్టర్‌గా శివగమి పాత్రలో నటించిన రమ్యకృష్ణ పోస్టర్ రేపు (మే 8న) విడుదల కానుంది. ఇలా సినిమా విడుదలకు ముందే అంచనాలను తారాస్థాయికి చేర్చి ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమాకు అవసరమైన క్రేజ్‌ను, ప్రమోషన్‌ను బాహుబలి అప్పుడే సొంతం చేసుకుంది. ఇక సినిమా రిలీజ్‌కు దగ్గరయ్యే కొద్దీ రాజమౌళి ఇంకెన్ని ప్రయోగాలు చేపడతాడో చూడాలి.