
ప్రముఖ హీరో రాజేంద్రప్రసాద్ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా పోటీ చేయనున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ అసోసియేషన్‌కు ప్రస్తుతం నాటి హీరో, ఎంపీ మురళీ మోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొత్త కార్యవర్గం కోసం మార్చి 29న జరగనున్న ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడుగా పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ధృవీకరించారు. తాను ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నిస్తున్నాని, ఒకవేళ వేరే ఎవరైనా పోటీకి దిగినా.. ఎన్నికల్లో పోటీకీ కూడా సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
2013-15 దఫాకు కార్యవర్గంలోని కొన్ని ఇతర పదవులకు పోటీ జరిగినా.. అధ్యక్షుడిని మాత్రం ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. గత రెండు దఫాలుగా మురళీ మోహన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ పదవిని మళ్ళీ చేపట్టే ఆలోచన ఆయనకు లేదని సమాచారం. ఈ క్రమంలోనే రాజేంద్రప్రాసాద్ తెరపైకి వచ్చారు. మరి సాంప్రదాయం ప్రకారం.. ఈసారి కూడా అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుందా లేదా అనేది చూడాలి.
తెలుగు సినీ పరిశ్రమలో రాజేంద్రప్రసాద్‌కు ఒక మంచి పేరుంది. హాస్య కథా చిత్రాల హీరోగా ఆయనకున్న ఖ్యాతి ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఈమధ్య కాలంలో పూర్తి స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఆయన సాగిస్తున్న కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా అద్భుత పాత్రలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, టామీ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.

