కావేరీ నదీ జలాల విషయమై మే 20న సుప్రీం కోర్టు ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం పాటించాలని రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కన్నడ ప్రజలు జూన్ 7న విడుదలకావల్సిన ఆయన ‘కాలా’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదలచేయకూడదని పట్టుబట్టారు. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లు గనుక సినిమాను రిలీజ్ చేస్తే నిరసన తప్పదని హెచ్చరించారు. దీంతో పంపిణీదారులు సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్టు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ సార గోవిందు తెలిపారు.
దీనిపై ఇప్పటికే పలువురు తమిళ సినీ ప్రముఖులు అభ్యంతరం చేయగా రజనీకాంత్ కూడ ఈ ఇష్యూపై స్పందిస్తూ దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్, కన్నడ ఫిల్మ్ ఛాంబర్లు కలుగజేసుకుని స్నేహపూర్వక వాతావరణంలో వివాదాన్ని పరిష్కరించి కర్ణాటకలో సినిమా విడుదలయ్యేలా చూడాలని కోరారు. మరి ఆయన మాట ప్రకారం దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఈ వివాదాన్ని పరిష్కరించి సినిమా విడుదలయ్యే వెసులుబాటును కల్పిస్తుందో లేదో చూడాలి.


