సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగ’. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశలో ఉంది. ఇటీవలే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందని తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని ఓ పాటని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ – విక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఐ’ సినిమా ఆడియో వేడుకకి హాజరు కావాల్సిన కారణంగా లింగ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు.
రేపు మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సాంగ్ షూట్ ని ఫినిష్ చేసి చిన్న గ్యాప్ తీసుకున్న తర్వాత అక్టోబర్ మొదటి వారం నుండి యూరప్ లో రెండు పాటలను షూట్ చేయనున్నారు. రజినీకాంత్ ద్విపాత్రాభినయం పోషిస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
‘ముత్తు’, ‘నరసింహా’ సినిమాల తర్వాత కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజినీ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. దీపావళి కానుకగా లింగ ఆడియోని రిలీజ్ చేసి రజినీ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.


