
బుల్లితెరపై రియాలిటీ షోస్ హోస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్, ఆ తర్వాత ‘జీనియస్’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. జీనియస్ సినిమా సూపర్బ్ రిజల్ట్ ఇవ్వకపోయినా, ఓంకార్‌కి దర్శకుడిగా మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘జీనియస్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్, తాజాగా మొదటి ప్రయత్నానికి భిన్నంగా ‘రాజుగారి గది’ అంటూ హర్రర్ కామెడీతో మనముందుకు వచ్చారు.
దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదలైన ఈ సినిమా, విడుదలైన అన్నిచోట్లా సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకెళుతోంది. ఓ సాధారణ చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి గది, ప్రస్తుతం దసరా సీజన్లో మంచి కలెక్షన్స్‌తో హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలోనే రాజుగారి గది టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ.. సినిమాకు ఇంత మంచి విజయాన్ని తెచ్చిపెట్టిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ నిర్మాతలు సాయి కొర్రపాటి, అనిల్ సుంకరల సహకారం వల్లే సినిమా ఈ స్థాయి విజయం సొంతం చేసుకుందని తెలిపారు. ఇక అక్టోబర్ 30న ఈ సినిమా యూఎస్ ప్రేక్షకులనూ అలరించనుందని ఓంకార్ ఈ సందర్భంగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌ను, కలెక్షన్స్నూ వసూలు చేస్తోన్న ఈ సినిమా, అమెరికాలోనూ అదే స్థాయిలో అలరిస్తుందన్న నమ్మకాన్ని సినిమా యూనిట్ వ్యక్తం చేసింది.

