‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌పై ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, ఈ యంగ్ హీరో తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అసలు విషయానికి వస్తే.. హీరో అఖిల్ రాజ్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయగా, సదరు డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ డెలివరీ చేశాడు. ఈ చిన్న పొరపాటుపై తీవ్ర ఆగ్రహానికి గురైన అఖిల్ రాజ్, డెలివరీ బాయ్‌పై ఆగ్రహంతో ఊగిపోయాడు. డెలివరీ బాయ్ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పినప్పటికీ, సదరు హీరో వినకుండా అతనిపై దాడికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న అఖిల్ రాజ్ తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా వినకుండా, బిల్డింగ్ మెట్లపై డెలివరీ బాయ్ వైపు దూసుకువెళ్తూ అఖిల్ రాజ్ భౌతిక దాడికి దిగినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.
మరోవైపు, తాను క్షమాపణలు చెప్పినా కూడా వినకుండా హీరో తనపై దాడి చేశాడని బాధితుడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం ఒక్క సినిమాతో గుర్తింపు రాగానే ఇంత ఓవరాక్షన్ ఏంటని నెటిజన్లు అఖిల్ రాజ్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదంపై అఖిల్ రాజ్ ఏమైనా స్పందిస్తాడా అనేది చూడాలి.


