దర్శకుడు నితీష్ తివారీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రామాయణం’. ఈ భారీ ప్రాజెక్ట్‌లో రణ్‌బీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ‘శూర్పణఖ’ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్, తాను ఈ క్యారెక్టర్ ఎంచుకోవడానికి గల కారణాలను స్పష్టం చేశారు.
‘రామాయణం’లో భాగం కావడమే ముఖ్యం
భారతీయ సంస్కృతిలో రామాయణం అత్యంత ప్రాధాన్యమైన కావ్యమని రకుల్ తెలిపారు. అలాంటి కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్నప్పుడు అందులో భాగమయ్యే అవకాశం రావడం విశేషమని ఆమె పేర్కొన్నారు. పాత్ర చిన్నదా లేదా పెద్దదా అనే దానికంటే, అంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రంలో భాగం కావడం తనకు ప్రధానమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు నితీష్ తివారీ మేకింగ్ శైలిని ఆమె ప్రశంసించారు. శూర్పణఖ పాత్రను ఆయన తీర్చిదిద్దిన తీరు, దానికి ఉన్న ప్రాధాన్యత నచ్చడంతోనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతోషాన్నిస్తోందని రకుల్ వెల్లడించారు.
