మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని చరణ్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. భోపాల్ వేదికగా జరిగిన ‘పెద్ది కి ఆవాజ్’ మ్యూజికల్ ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ మధ్యప్రదేశ్ నుంచి గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన లైవ్ కాన్సర్ట్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇదే వేదిక పైనుంచి ‘పెద్ది’ మూడో సింగిల్ ‘హల్లల్ల ల్లో’ పాటను అట్టహాసంగా రిలీజ్ చేశారు.
ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. భోపాల్ ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ప్రమోషన్స్‌ను ఇక్కడి నుంచి మొదలుపెట్టడం ఎంతో ఎమోషనల్‌గా అనిపిస్తోందని తెలిపారు. “మేమంతా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం. ఇది కేవలం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ మాత్రమే కాదు.. తన ఉనికి కోసం ఓ వ్యక్తి చేసే పోరాటం. ఆ ఎమోషన్ కచ్చితంగా మీ గుండెల్ని తాకుతుంది” అని చరణ్ చెప్పుకొచ్చారు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని, తన ఫిల్మ్ లైబ్రరీలో ‘పెద్ది’ నంబర్ వన్ స్థానంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన నిర్మాత సతీష్ కిలారు, దర్శకుడు బుచ్చిబాబుతో పాటు కో-స్టార్స్ జాన్వీ కపూర్, రవికిషన్, దివ్యేందులకు చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్‌లో ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరారు. సక్సెస్ మీట్‌తో మళ్లీ భోపాల్ వస్తానని అభిమానులకు ప్రామిస్ చేశారు. మరోవైపు రామ్ చరణ్ తన డ్యాన్స్, పెర్ఫార్మెన్స్‌తో ఈ పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారని ఏఆర్ రెహమాన్ ప్రశంసించారు.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, రెండు పాటలు హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ యాక్షన్ డ్రామాకు, జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.
