చిరు 150వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన చరణ్!

చిరు 150వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన చరణ్!

Published on Jul 10, 2015 2:30 PM IST

ramm-charan
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరు 150వ సినిమా ఉంటుందన్న విషయాన్ని ఈ సినిమాను నిర్మించనున్న రామ్ చరణ్ ఇప్పటికే తెలియజేశారు. ఈ విషయమై స్క్రిప్ట్ చర్చలు కూడా వేగంగా జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా చిరు సినిమాకు దర్శకుడు మారిపోయారని, పూరీ జగన్నాథ్ స్థానంలో మరో స్టార్ డైరెక్టర్‌ను చిరు ఎంపిక చేశారని.. ఇలా రకరకాల వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ వార్తలపై రామ్ చరణ్ ఓ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చిరంజీవి 150వ సినిమాకు ఇంతకుముందు ప్రకటించిన విధంగానే పూరీ ఓ కథ సిద్ధం చేశారని, ఫస్టాఫ్ తనకు బాగా నచ్చిందని, సెకండాఫ్ కూడా పూర్తయ్యాక ఆ ప్రాజెక్టు గురించి తెలియజేస్తానని చరణ్ తెలిపారు. తన ట్రూ జెట్ విమానయాణ సంస్థ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన చిరు సినిమాపై తలెత్తిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇక చిరుతో సినిమా చేసేందుకు వి.వి.వినాయక్ సైతం సిద్ధంగా ఉన్నారని, సినిమాకు కథే ప్రధానం కావున ఏ ప్రాజెక్టు ఫైనలైజ్ అవుతుందని ఇప్పుడే చెప్పలేమని చరణ్ ఈ సందర్భంగా అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు