ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న ఆర్జీవీ ప్రస్తుతం తన స్థాయికి తగ్గ సినిమా ఒక్కటీ చేయట్లేదు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఏదో ఒక రోజు తమ అభిమాన దర్శకుడు ఓ గొప్ప సినిమా తీస్తే చూడాలన్న ఆశ మాత్రం వదులుకోలేదు. ప్రయోగాలు, జీవితానికి దగ్గరగా ఉండే కథలంటే వర్మకు విపరీతమైన ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ముంబై మాఫియా, గ్యాంగ్‌స్టర్ సినిమాలను ఎక్కువగా చేశాడు. తాజాగా మరో రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించే పనిలో పడ్డాడు వర్మ.
వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు. ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు. అలాంటి క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్’గా వర్మ తెలిపాడు.
ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వీరప్పన్‌ను చంపే ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. శివరాజ్ కుమార్ తండ్రి రాజ్‌కుమార్‌ను గతంలో వీరప్పన్ కిడ్నాప్ చేసి హింసించిన విషయం తెలిసిందే. ఆ రకంగా శివరాజ్ కుమార్ రియల్ లైఫ్ విలన్‌పై రీల్ లైఫ్‌లో ప్రతీకారం తీర్చుకున్నట్టవుతుందని వర్మ చెప్పుకొచ్చాడు.


