వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే! ఒకప్పుడు దేశంలోని ప్రఖ్యాత దర్శకుల్లో ఒకరుగా పేరుగాంచిన వర్మ, ఈ మధ్యకాలంలో తనదైన బ్రాండ్ సినిమా ఒక్కటీ చేయక దర్శకుడిగా పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారు. అయినప్పటికీ వర్మపై ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. వర్మ ఏదో ఒకరోజు తనదైన సినిమా చేయకపోతాడా అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే.. సినిమాలెలా ఉన్నా వర్మ తాజాగా తన ఆత్మకథతో అలరించేందుకు సిద్ధం కావడం ఆయన అభిమానులకు ఆసక్తికరంగా కనిపించే అంశంగా చెప్పుకోవచ్చు.
‘గన్స్ అండ్ థైస్ – స్టోరీ ఆఫ్ మై లైఫ్’ పేరుతో రామ్ గోపాల్ వర్మ తన ఆత్మకథను పట్టుకొస్తున్నారు. ప్రముఖ పబ్లికేషన్స్ సంస్థ రూప పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకు వస్తోంది. ఈ పుస్తకానికి సంబంధించిన కవర్ ఫోటో, లోగోను వర్మ విడుదల చేస్తూ, వచ్చే నెలలో పుస్తకం విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే తెలుగులో ‘నా ఇష్టం’ పేరుతో ఆత్మకథ లాంటిదే ఒకటి రాసి సంచలనం సృష్టించిన వర్మ ఈ కొత్తది, పూర్తి ఆత్మ కథ అయిన గన్స్ అండ్ థైస్‌తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో అన్నది చూడాలి. ఇక వర్మ సినిమాల విషయానికి వస్తే.. వర్మ ఈజ్ బ్యాక్ అన్న టాగ్‌తో వస్తోన్న ‘కిల్లింగ్ వీరప్పన్’ త్వరలోనే నాలుగు ప్రధాన భాషల్లో పెద్ద ఎత్తున విడుదల కానుంది.


