విషాదం : రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ రామ్మోహన్‌రావు కన్నుమూత

విషాదం : రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ రామ్మోహన్‌రావు కన్నుమూత

Published on Oct 22, 2022 4:39 PM IST

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిలిం సిటీలో అనేక దేశాల, భాషల సినిమాల షూటింగ్స్ తరచు జరుగుతూ ఉంటాయి. మన హైదరాబాద్ కి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిన రామోజీ ఫిలిం సిటీకి తరచు వందలాది మంది వీక్షకులు వచ్చి పలు షూటింగ్స్ చూస్తుండడంతో పాటు ఫిలిం సిటీ అందాలను వీక్షిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈటివి సంస్థల అధినేత రామోజీరావు చేత నెలకొల్పబడ్డ రామోజీ ఫిలిం సిటీ కి ఎప్పటి నుండో ఎండీ గా వ్యవహరిస్తూ విశేష సేవలు అందిస్తూ వస్తున్న అట్లూరి రామ్మోహన్ రావు నేడు కన్నుమూశారు.

రామోజీ గ్రూప్ సంస్థల్లో ఆయన సుదీర్ఘకాలం పాటు పని చేశారు. 1935లో కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామ్మోహన్ రావు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ఆరంభించిన అనంతరం 1975లో ఈనాడు సంస్థతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆపైన ఈనాడు దినపత్రిక ఎండి గా కూడా పని చేసారు. ఆయన రామోజీరావుకి సహాధ్యాయి, బాల్యస్నేహితుడు కూడా. ఇటీవలే పదవి విరమణ చేసిన రామ్మోహన్ రావు కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు. కాగా ఆయన మృతికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రేపు ఉదయం 10 గం. లకు హైదరాబాద్ జూబిలీ హిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు