బాబాయ్ అరుదైన ఫోటో షేర్ చేసిన అబ్బాయ్

Published on Aug 14, 2019 8:24 am IST

దగ్గుబాటి రానా నేడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బాబాయ్ వెంకటేష్ కి సంబంధించిన ఓ ఫోటో పోస్ట్ చేశారు. హీరోయిన్ కుష్బూతో కలిసి ఉన్న ఆరొమాంటిక్ ఫోటోని నేడు ఇలా అభిమానులతో పంచుకోవడం వెనుక కారణం లేకపోలేదు. ఆ చిత్రం టాలీవుడ్ లో వరుస విజయాలకు చిరునామా అయిన విక్టరీ వెంకటేష్ మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’ లోనిది. వెంకటేష్ నటించిన మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’ సరిగ్గా ఇదే తారీఖున అంటే ఆగస్టు 14,1986లో విడుదలై విజయం సాధించింది. మూవీ మొఘల్ రామానాయుడు సినీ వారసుడిగా వెంకటేష్ నట ప్రస్థానం మొదలుపెట్టి నేటికీ సరిగ్గా 33 సంవత్సరాలు పుర్తయింది.

అమెరికాలో ఎంబీఏ చదువు పూర్తి చేసుకువచ్చిన వెంకటేష్ నిజానికి రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబులానే, చిత్ర నిర్మాత లేదా,ఓ వ్యాపారవేత్తగా ఎదగాలనుకున్నారు. కలియుగ పాండవులు చిత్రం తీయడం కోసం హీరో కొరకు వెతుకుతున్న రామానాయుడు గారికి, వెంకటేష్ ని చూసిన ఓ దగ్గరి వ్యక్తి, ఎవరికోసమో వెతకండం దేనికండీ, వెంకటేష్ బాబు హీరోగా చక్కగా సరిపోతారు, బాబుతోనే ఈ మూవీని తీయండి అని సలహా ఇచ్చారట. అలా సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన కలియుగ పాండవులు చిత్రం ద్వారా వెంకీ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. ఇక ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ఖుష్బూ నటించగా, సరిత,చిట్టిబాబు, రావు గోపాల్ రావ్, నూతన ప్రసాద్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రలు చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :