
మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే యూత్‌లో, మాస్లో ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక అలాంటి అంశాలను సరిగ్గా పట్టుకున్న కొందరు దర్శకులు రవితేజ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం దర్శకులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భోయపాటి శ్రీను, శ్రీనువైట్ల, హరీష్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని.. లాంటి వారంతా రవితేజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వారే! తాజాగా ఈ జాబితాలో చేరిపోయేందుకు మరో కొత్త దర్శకుడు సిద్ధమవుతున్నారు.
రవితేజ హీరోగా నటించిన ‘బలుపు’, ‘పవర్’ సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన చక్రి రవితేజతో ఓ సినిమా చేయనున్నారు. చక్రి చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన రవితేజ, వెంటనే ఈ ప్రాజెక్టును ఓకే చేసేశారట. రవితేజ స్టైల్లో సాగే మంచి ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అఫీషియల్‌గా విడుదల చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. మరి రవితేజ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కావడమంటే లక్కీగా భావించే పరిస్థితుల నేపథ్యంలో ఓ కొత్త దర్శకుడు రవితేజ సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

