టాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్లను ఓటీటీ సంస్థలు నిర్ణయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద సినిమాల నుండి చిన్న చిత్రాల వరకు చెప్పిన సమయానికి థియేటర్లలోకి రావడం కష్టంగా మారింది. తాజాగా ఈ జాబితాలోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘హైందవ’ కూడా చేరింది.
ఈ నెల 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, సినిమా షూటింగ్ పూర్తయి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్నప్పటికీ, కేవలం ఓటీటీ సంస్థల నిబంధనల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సాయి శ్రీనివాస్ నటించిన మరో చిత్రం ‘టైసన్ నాయుడు’ డిసెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉండటమే. ఒకే హీరో సినిమాలు రెండు మూడు వారాల వ్యవధిలో వస్తే డిజిటల్ స్ట్రీమింగ్ పరంగా ఇబ్బందులు వస్తాయని, కనీసం రెండు నెలల గ్యాప్ ఉండాలని ఓటీటీ సంస్థలు స్పష్టం చేశాయి.
ఇప్పటికే పలుమార్లు ఆలస్యమైన ‘టైసన్ నాయుడు’ను మరింత వాయిదా వేయలేక, ఆ సినిమా కోసం ‘హైందవ’ను వెనక్కి తగ్గించారు. జనవరిలో సంక్రాంతి సినిమాల పోటీ ఉండటంతో, ‘హైందవ’ థియేటర్లలోకి రావడానికి ఫిబ్రవరి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


