
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు ఈ ఏడాది టాలీవుడ్ పరిధిని దాటి, ఇండియా మొత్తం మారు మ్రోగి పోయింది. దానికి కారణం ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించిన ‘బాహుబలి’ సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యి ఇండియాలోనే టాప్ 3 గ్రాసర్స్ లో మూడవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి 2’ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. డిసెంబర్ 14 నుంచి ‘బాహుబలి 2’ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రభాస్ బాహుబలి 2 పూర్తయ్యి రిలీజ్ అయ్యే వరకూ దాదాపు తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడని ఆయన సన్నిహిత వర్గాలు తేల్చి చెప్పేసాయి. అయినప్పటికీ బాహుబలి 2 తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడు అనే ఆసక్తి అయితే నెలకొంది.
బాహుబలి తర్వాత రన్ రాజా రన్ ఫేం సుజీత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ పెదనాన్న అయిన కృష్ణరాజు చాలా రోజుల నుంచి ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా కృష్ణంరాజు తన హోం బ్యానర్ అయిన గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై ‘దందా’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేసారు. ఫుల్ మాస్ గా ఉన్న ఈ టైటిల్ ని ప్రభాస్ కోసమే రిజిష్టర్ చేసినట్లు సమాచారం. మరి ఈ సినిమాకి దర్శకుడిగా కూడా కృష్ణంరాజు వ్యవహరిస్తాడా లేక వేరే ఎవరన్నా డైరెక్ట్ చేస్తారా అన్నది చూడాలి.

