
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘కబాలి’ పేరుతో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం నేపథ్యంలో నడిచే సినిమాకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. అట్టకత్తి, మద్రాస్ సినిమాలతో తమిళనాట పాపులర్ అయిన యువ దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా, సెప్టెంబర్ 17నుంచి సెట్స్‌పైకి వెళ్ళనుంది. రెండు వరుస పరాజయాల తర్వాత రజనీ కెరీర్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన అంచనాలు బయలుదేరాయి.
ఇక ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తనదైన స్టైల్ సినిమాను రూపొందించేందుకు రంజిత్ ఓ పక్కా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఓ రిహార్సల్ షూట్ కూడా జరుపుతున్నారని తెలుస్తోంది. ఇక గత కొద్దిరోజుల క్రితం మేజర్ క్యాస్టింగ్‌పై చేసిన ఓ టెస్ట్ ఫోటోషూట్‌లోని ఫోటోలు కొన్ని లీకైన విషయం తెలిసిందే. ఈ ఫోటోలను చూసిన వారంతా రజనీ స్టైల్‌కు ఫిదా అయిపోయారు. ఇక సినిమాను అన్ని విధాలా ది బెస్ట్ అనిపించేందుకు దర్శక నిర్మాతలు అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మేజర్ క్యాస్టింగ్‌తో కలిపి ఓ రిహార్సల్ షూట్ జరుపుతున్నారు. రజనీ కూడా ఈ సెషన్లో పాల్గొన్నారని సమాచారం. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూట్ చెన్నై, మలేషియాల్లో జరగనుంది.

