ఇంటర్వ్యూ: సంజన రెడ్డి – ఆర్జీవిగారి మూలంగానే డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నా !

ఇంటర్వ్యూ: సంజన రెడ్డి – ఆర్జీవిగారి మూలంగానే డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నా !

Published on May 28, 2018 1:05 PM IST

జూన్ 1న విడుదలకానున్న రాజ్ తరుణ్ చిత్రం ‘రాజుగాడు’. ఈ చిత్రంతో నూతన దర్శకురాలు సంజన రెడ్డి పరిచయంకానుంది. చిత్ర విడుదల సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం…

మీ నేపథ్యం ఏమిటో చెప్పండి ?
నాది శ్రీకాకుళం. అమ్మ నాన్న టెక్కలిలో ఉంటారు. నేను మొదట్లో ఐటీలో ఉద్యోగం చేశాను. ఆ తర్వాత జర్నలిస్టుగా వర్క్ చేసి మెల్లగా సినిమాల్లోకి వచ్చాను.

ఇంతకూ ముందు ఏవైనా సినిమాలకు పనిచేశారా ?
రామ్ గోపాల్ వర్మగారి దగ్గర ‘రౌడీ’ సినిమాకు కొంతకాలం పనిచేశాను. ఆ తరవాత కొన్ని ప్రకటనల్ని డైరెక్ట్ చేశాను. వాటిలో అమలగారితో చేసిన యాడ్ కూడ ఉంది.

డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడనిపించింది ?
మొదటి నుంచి డైరెక్టర్ అవ్వాలని అనుకోలేదు. కానీ రాముగారి వద్ద పనిచేశాక ఒక మనిషి సినిమాలు మీద ఇంత కమిట్మెంట్ తో ఉంటారా అని ఆశ్చర్యం కలిగింది. అప్పుడే డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను.

ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది ?
రాజ్ తరుణ్ తో ట్రావెల్ చేసేప్పుడు ఈ కథ ఆయనకు చెప్పాను. ఆయనకి కూడ నచ్చి ఏకే ఎంటర్టైన్మెంట్స్ లోనే సినిమా చేద్దాం అన్నారు. అలా కుదిరింది ఈ సినిమా.

సినిమా ఎలా ఉండబోతోంది ?
ఇది పూర్తి ఎంటర్టైనర్. సరదాగా కుటుంబం మొత్తం కలిసి చూడదగిన సినిమా. ఇందులో రాజ్ తరుణ్ కు క్లెప్టోమేనియా అనే మెడికల్ డిజార్డర్ ఉంటుంది. దాని వలన ఎప్పుడో దొంగతనాలు చేస్తుంటాడు. అలాంటివాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కథ.

దర్శకత్వం కష్టమనిపించలేదా ?
అనిపించలేదా అంటే .. అనిపించింది. కానీ ఇష్టమైనది కాబట్టి కష్టం కాలేదు.

సినిమా మొదలయ్యేటప్పుడు, ఇప్పుడు మీలో మార్పులేవైనా వచ్చాయా ?
వచ్చాయి. సినిమా పూర్తయ్యేసరికి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. నాలో సహనం కూడ బాగా పెరిగింది.

డైరెక్టర్ అవుతానంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ?
ఏమీ అనలేదు. మా ఇంట్లో వాళ్ళు మొదటి నుండి నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. నేను ఏం చేయాలి అనేదే నన్నే నిర్ణయించుకోమనేవారు.

రాజ్ తరుణ్ తో వర్క్ ఎలా ఉంది ?
చాలా బాగుంది. స్క్రిప్ట్ దగ్గర్నుంచి అన్నిచోట్ల నాకు సహాయం చేశాడు. సెట్స్ లో ఎప్పుడూ హైపర్ గానే ఉంటాడు.

ఈ సినిమా ప్రేక్షకులకి ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?
సినిమాలో ఇంటర్వెల్, ముగింపు కొంచెం సినిమాటిక్ గా అనిపించినా మిగతా మొత్తం చాలా సహజంగా ఉంటుంది. ప్రేక్షకులకి ఒక మంచి, సరదా సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు