
ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలతో, సినిమాల్లో తాను ఎంచుకునే నేపథ్యాలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ, గత వారం రోజులుగా ‘బాహుబలి’ సినిమాపై వరుసగా ట్వీట్స్ చేస్తూ సంచలనంగా మారిపోయారు. ఇండియాలో ‘బాహుబలి’ లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదని, రాజమౌళి సాహసం, విజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ నాలుగైదు రోజులుగా ట్వీట్స్ చేస్తూ వస్తోన్న రామ్ గోపాల్ వర్మ, పనిలో పనిగా తెలుగు సినిమా హీరోలపై కూడా కామెంట్లు గుప్పిస్తూ పోయారు.
తాజాగా చిరంజీవి 150వ సినిమాను కూడా ‘బాహుబలి’తో ముడిపెడుతూ వర్మ చేసిన కామెంట్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. “ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలియే ఈ రేంజ్ కలెక్షన్లు కొల్లగొడితే, చిరు-రాజమౌళిల కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఇంకెంత రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టాలి? నన్నడిగితే చిరు 150వ సినిమాను రాజమౌళి తప్ప మరొకరు డీల్ చేయలేరనే చెబ్తా. చిరు 150వ సినిమా అంటే అది కచ్చితంగా ‘బాహుబలి’ కంటే గొప్పగా ఉండాలి. అలాంటప్పుడు దానికి రాజమౌళియే దర్శకత్వం వహించాల్సి ఉంటుంది. చిరు 150వ సినిమాను వేరే ఇంకెవ్వరు తీసినా ఆకట్టుకోలేరు” అంటూ వర్మ కామెంట్ చేశారు.
ఇక రామ్ చరణ్ తేజ్ స్వయంగా సొంత బ్యానర్‌లో నిర్మించనున్న చిరంజీవి 150వ సినిమా విషయమై ఇప్పటికీ ఓ సరైన క్లారిటీ రాలేదు. పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్ ఇద్దరూ ఎవరికి వారే కథలు సిద్ధం చేస్తున్నారు. అందులో ఏది ఫైనల్ అయితే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని తెలుస్తోంది. మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు ఈ కాంబినేషన్లపై ఏమైనా ప్రభావం చూపిస్తాయా అన్నది ఆసక్తికర ప్రశ్న!

