రోజు రోజుకీ ముదురుతున్న వర్మ వివాదం !
Published on Feb 20, 2018 5:38 pm IST

రామ్ గోపాల్ వర్మ చేసిన ‘జీఎస్‌టీ’ వెబ్ చిత్ర వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ‘జీఎస్‌టీ’ పై జరిగిన చర్చోపచర్చల్లో వర్మ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక కార్యకర్త దేవి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వర్మను స్టేషన్ కు పిలిచి మరీ కొన్ని గంటలపాటు విచారించారు.

ఈ విచారణలో భాగంగా ఆయన సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అంతేగాక చిత్రాన్ని ఎవరు నిర్మించారు, ఇందులో ఎవరెవరి భాగస్వామ్యం, సహకారం ఉంది వంటి అంశాలని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి సంబంధీకులు ఎవరైనా సరే విచారిస్తామని కూడ అన్నారు. దీన్నిబట్టి డైరెక్షన్ టీమ్, కెమెరా మెన్, సంగీత దర్శకులకు కూడా నోటీసులు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

మరోవైపు వర్మ నిజాలను వక్రీకరిస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు, విచారణ సమయంలో వివరాలను బయటకు వదులుతున్నందుకు ప్రముఖ టీవీ ఛానెల్ పై క్రిమినల్ కేసులు పెడుతున్నానని తెలిపి వ్యవహారాన్ని మరింత వేడెక్కించారు. ఇంతలా రాజుకుంటున్న ఈ వివాదం చివరకు ఎక్కడ ముగుస్తుందో చూడాలి.

 
Like us on Facebook