
ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని పలు విమర్శలు చేయడం అలవాటే! తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా కామెంట్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హీరోగా అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్, గత ఎన్నికల సమయంలో జనసేన పేరుతో ఓ పార్టీని నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రజల తరపున పోరాడటమే తమ ఎజెండా అని చెబుతూ వచ్చిన పవన్, ప్రజల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటానని మాటిచ్చారు కూడా.
ఇక ఆ మాట ప్రకారమే పలుమార్లు ప్రభుత్వాలపై విమర్శలు చేసిన పవన్, కొద్ది రోజులుగా సైలైంట్ అయ్యారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారంతో రాజకీయం వేడెక్కింది. వాడీ వేడీ విమర్శల పర్వంతో ఈ ఎపిసోడ్ రాజకీయంగా సంచలనంగా మారింది. అయినా పవన్ ఈ విషయంపై ఒక్కసారి కూడా స్పందించలేదు. ఇక ఇదే విషయమై వర్మ ట్విట్టర్ వేదికగా చేసుకొని “ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రొహమ్..ఇది కళ్యాణ ద్రోహం” “పాలకుల్ని ప్రశ్నిస్తాననే వాడు ప్రశ్నించనప్పుడు, కళ్యాణం కోరుకునే జనాలకి పెళ్ళెప్పుడు?” అంటూ తన స్టైల్లో పరోక్షంగా విమర్శించారు. మరి ఈ ట్వీట్లపై పవన్ ఎలా స్పందిస్తారోనన్నది ఆసక్తికర ప్రశ్న!